Share News

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:04 PM

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం భద్రాచలం వల్ల గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది.

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
Bhadrachalam Godavari flood

భద్రాద్రి కొత్తగూడెం, జులై 31: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు(శుక్రవారం) ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. 9,74,666 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో కల్యాణకట్ట, స్నాన ఘట్టాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సాయంత్రం వరకు నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఈ నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార వర్గాలు సూచించాయి. గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతుండంటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ కూడా గోదావరి వైపుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.


మరోవైపు తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండుకుండలా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, మిడ్‌మానేరు, సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. భారీ వరద ప్రవాహంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు కడెం ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పడుతోంది. అలాగే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 11.290 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి...

సూట్‌కేస్‌లో యువతి మృతదేహం.. నిందితుడి అరెస్ట్

లక్ష్యాలను నెరవేర్చకపోతే కఠిన చర్యలు తప్పవు.. ఆయిల్ పామ్ కంపెనీలకు తుమ్మల ఆదేశాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 12:42 PM