కార్తీకపౌర్ణమి వేళ తెలంగాణలో శివనామస్మరణలతో మార్మోగిన ఆలయాలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 10:23 AM
పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో ఆలయాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్, నవంబరు 24: పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీతో ఆలయాలన్నీ శివ నామస్మరణలతో మార్మోగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
వరంగల్: కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. శైవక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో పోటెత్తిన భక్తులు.. దీపారాధనతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పవిత్ర స్నానాలు ఆచరించి.. పవిత్ర గోదావరి నదిలో దీపాలు వదులుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: కార్తీక పౌర్ణమి సందర్భంగా భద్రాచలం గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి నది ఒడ్డున ప్రత్యేక పూజలు నిర్వహించి.. నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. దానితోపాటు రామాలయ అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తుల సందడితో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది.
ఉమ్మడి నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సందర్బంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. శివ నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు. పెద్దసంఖ్యలో మహిళలు దీపారాధన చేస్తుండడంతో ఆలయ ప్రాంగణాలన్నీ దీపకాంతులతో వెలిగిపోతున్నాయి. నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయాలు భక్తజనసంద్రాన్ని తలపిస్తున్నాయి. మిర్యాలగూడలోని వాడపల్లి శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి శోభ నెలకొంది. సూర్యాపేట పిల్లలమర్రి శివాలయం భక్తజనంతో నిండిపోయింది. యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవస్థానానికి భారీగా తరలివస్తున్న భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే శివాలయాల వద్ద భక్తులు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం, నందిపేటలోని కేదారేశ్వర ఆలయం, బోధన్‌లోని ఏక చక్రేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలతో ఆలయాలన్నీ ఆధ్యాత్మికత వాతావరణంతో నిండిపోయాయి.
నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లాలోని అచ్చంపేట ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు శైవ ఆలయాలకు పోటెత్తుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉట్ల కోనేరులో మహిళలు కార్తీకదీపాలు వెలిగించారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఉట్ల కోనేరు నుంచి 108 కలశాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో అలంపూర్‌లోని తుంగభద్రా నది షవర్ల వద్దకు, బీచుపల్లి వద్దకు చేరుకుని.. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
మంచిర్యాల: తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ గుడెం గుట్ట సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీకపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News