జైళ్లపై నిరంతర నిఘా..!
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:31 AM
రాష్ట్రంలోని జైళ్ల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు జైళ్ల శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది.
ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
అక్కడి నుంచే అన్ని జైళ్లలో వ్యవహారాలపై కెమెరాలతో నిఘా
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్ల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు జైళ్ల శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగా జైళ్ల విభాగం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్ర కారాగారాలు, జిల్లా, సబ్ జైళ్లలో జరిగే వ్యవహారాలను ఒకేచోటి నుంచి పర్యవేక్షించే ఏర్పాటు చేశారు. జైళ్ల ప్రధాన ద్వారంతోపాటు లోపల ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించి ఖైదీల కదలికలు, సిబ్బంది విధులు, సందర్శకుల రాకపోకలపై నిఘా పెట్టారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటన జరిగితే తక్షణమే ఉన్నతాధికారులకు సమాచారం అందించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీని బ్యారక్‌లో ఉంచకుండా వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించిన ఘటనలో కమాండ్ కంట్రోల్ నుంచి సేకరించిన ఫుటేజీ ఆధారంగానే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
కొద్దిరోజుల క్రితం తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్ జైలు నుంచి ఖైదీలు పరారైన ఘటన తర్వాత రాష్ట్రంలోని జైళ్ల భద్రతను ఉన్నతాధికారులు మరింత కఠినతరం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ జైలు నుంచి ఎంత మంది ఖైదీలు పరారయ్యారు? వారిలో ఎంతమంది తిరిగి పట్టుబడ్డారు? మిగతా వారి సమాచారం ఏంటి? అనే వివరాలు సేకరించి అందజేయాలని ఆదేశించారు. జైళ్లలో ఖైదీలపై గగణతల నిఘా ఉంచేందుకు డ్రోన్ టెక్నాలజీని వాడటానికి జైళ్ల శాఖ సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జైళ్ల ప్రహరీల అవతల అనుమానితుల కదలికలను కూడా గుర్తించటం.. జైలు లోపల ఖైదీల మధ్య ఘర్షణలను నివారించేందుకు డ్రోన్ల ద్వారా నిఘా పెట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం
ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు
Read Latest AP News And Telangana News And International News And Telugu News