Share News

నేతన్నల సంక్షేమమే అస్త్రంగా.. సిరిసిల్లపై సీఎం గురి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:33 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.

నేతన్నల సంక్షేమమే అస్త్రంగా.. సిరిసిల్లపై సీఎం గురి!
Revanth Reddy

  • రేపు లక్ష మందితో రగడు బైపాస్‌ వద్ద భారీ సభ

  • సీఎం హోదాలో తొలిసారిగా జిల్లాకు..

  • హ్యాండ్లూమ్‌ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్‌

  • రూ. 200వందల కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా నేత కార్మికుల సంక్షేమాన్నే ఆయన ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. ఇక్కడ నేతన్నల సంఖ్య.. ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 30, బుధవారం రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో పర్యటించనున్నారు.


ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సిరిసిల్ల పట్టణానికి వస్తున్న నేపథ్యంలో.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఈ పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రగడు బైపాస్‌ వద్ద సుమారు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వస్త్ర ఉత్పత్తి నిలయంగా పేరొందిన జిల్లాలో నేతన్నల సంక్షేమం, మహిళల సాధికారతతో పాటు విద్య, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.


‘నేతన్న బజార్‌’పై కీలక ప్రకటన!

నేతన్న ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. సిరిసిల్ల సాంచాలపైన త యారు చేసే పెట్టికోట్‌, పాలియెస్టర్‌ వస్త్రాల విక్రయాలకు వీలుగా ‘నేతన్న బజార్‌’ ఏర్పాటుపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీనికి అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక సహాయం కోసం చేనేత- జౌళి శాఖ కమిషనర్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపగా, ఇందుకు కావాల్సిన వ్యయం, తుది మంజూ రు నిధులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ బజార్‌ అందుబాటులోకి వస్తే నేత కార్మికుల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి లభించే అవకాశం ఉంది.


రూ. 345.78 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రూ. 345.78 కోట్ల విలువైన అభివృద్థి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సిరిసిల్లతో పాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విద్యా సముదాయంలో 5 నుంచి 12వ తరగతి వరకు సుమారు 2,600 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 64 తరగతి గదులు, డార్మిటరీలు, డైనింగ్‌ బ్లాక్‌లతో దీనిని తీర్చిదిద్దనున్నారు. సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను అందుబాటులోకి తేనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లతో తలపెట్టిన 26 రకాల పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు.


ఇందులో భాగంగా మండపాలు, గోపురాలు, ప్రాకారాలు, నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ, సీసీరోడ్లు, షాపింగ్‌ కాంప్లెక్సుల నిర్మాణం చేపట్టనున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ‘ఇందిరా మహిళా శక్తి భవన్‌’ను ప్రారంభించనున్నారు. సిరిసిల్ల, వేములవాడ, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌, రుద్రంగిలో నిర్మించబోయే ఆరు తహసీల్దార్‌ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రుద్రంగిలో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో గోదాములు, వేములవాడలో మహిళా పోలీస్‌ స్టేషన్‌తో పాటు వేములవాడ, సిరిసిల్లలో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డెలివరీ బాయ్స్‌కి ‘ఆశ్రయ్‌’

బస్టాండ్‌లో 4రోజులుగా ఈగలు, దోమల మధ్యే!
Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:34 AM