Share News

బస్టాండ్‌లో 4రోజులుగా ఈగలు, దోమల మధ్యే!

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:27 AM

పుడుతూనే పాలకేడ్చి.. పెరిగి పెద్దయ్యే దశలో బొమ్మలు, ఆటవస్తువులు, అవసరాలు, చివరకు ఆస్తుల కోసమూ ఏడ్చి ఏడ్చి కన్నవారి నుంచి అన్నీ సాధించుకున్న బిడ్డలే..

బస్టాండ్‌లో 4రోజులుగా ఈగలు, దోమల మధ్యే!
swaraopet elderly woman

  • అశ్వారావుపేటలో 80ఏళ్ల వృద్ధురాలి దీనస్థితి

  • 20 రోజుల క్రితం ఆటోలో తెచ్చి వదిలేసి వెళ్లిన బిడ్డలు

  • 4 రోజులుగా అపస్మారక స్థితిలో..

  • కుమార్తెకు స్థానికుల ఫోన్‌

  • తనకు సంబంధం లేదన్న కూతురు

అశ్వారావుపేట, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పుడుతూనే పాలకేడ్చి.. పెరిగి పెద్దయ్యే దశలో బొమ్మలు, ఆటవస్తువులు, అవసరాలు, చివరకు ఆస్తుల కోసమూ ఏడ్చి ఏడ్చి కన్నవారి నుంచి అన్నీ సాధించుకున్న బిడ్డలే.. ఆ తల్లిదండ్రులు అవసానదశకు చేరుకుంటే ఏమాత్రం దయలేకుండా ఆలోచిస్తున్నారా? కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రోడ్డు మీద పడి ఉన్న ఈ వృద్ధురాలి దీనస్థితి చూస్తే అలానే అనిపిస్తుంది. ఈమెకు 80ఏళ్లపైనే ఉంటాయి. నాలుగు రోజులుగా అలా చుట్టూ చేరి.. ముసిరిన ఈగలు, దోమల మధ్యే కొట్టుమిట్టాడుతోంది.


ఈమెకు చెట్టంత కొడుకుతో పాటు కూతురూ ఉంది. తల్లి కాస్త అనారోగ్యం బారినపడిందని తెలియగానే ఆ ఇద్దరు.. ఆమెను ఆటోలో తెచ్చి 20 రోజుల క్రితం బస్టాండ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మర్నాడు ఉదయం దుకాణదారులొచ్చి చూసి ఆమెను పలకరించారు. తనపేరు భద్రమ్మ అని.. తమది ములకపల్లి మండలం జగన్నాథపురం వద్ద ఉన్న చింతపేట గ్రామం అని, భర్త పేరు మల్లయ్య, గతంలోనే అతడు చనిపోయాడని చెప్పుకొంది. రోజూ అక్కడే ఉం టున్న ఆమెకు అక్కడి వ్యాపారులు అల్పాహారం, టీ, భోజనం పెడుతూ వస్తున్నారు. అయితే 4 రోజులుగా ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి తన పనులు తాను చేసుకోలే స్థితికి.. ఆహారం తీసుకోలేని స్థితికి చేరుకుంది.


వ్యాపారులు స్పందించి జగన్నాథపురంలో తమకు తెలిసిన వారికి ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ఆ వృద్ధురాలి కుమారుడెవరో తమకు తెలియదని, అయితే వీఎం బంజర్‌లో కుమార్తె ఉందని ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. డేగల రాము అనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సేవా సమితి నాయకుడు ఫోన్‌ చేసి వృద్ధురాలి కుమార్తెకు విషయం చెప్పాడు. దీనికి ఆ కుమార్తె ‘‘ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు’’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఫోన్‌ పెట్టేసిందని రాము చెప్పారు. విషయాన్ని స్థానికులు మునిసిపల్‌ కమిషనర్‌, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు వైద్యం చేయించి, కన్నబిడ్డల చెంతకు చేర్చాలని కోరుతున్నారు. ఎవరూ రాకపోవడంతో స్థానిక మహిళలు ఆమెకు స్నానం చేయించి, కొత్త దుస్తులు వేసి, భోజనం పెట్టారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అధికారులకు విషయం చెప్పినా స్పందించకపోవడంపై స్థానికుల నుంచి అసహనం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

డెలివరీ బాయ్స్‌కి ‘ఆశ్రయ్‌’

హైదరాబాద్‌లో ‘బిల్ట్రస్ట్‌’ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:27 AM