Share News

డెలివరీ బాయ్స్‌కి ‘ఆశ్రయ్‌’

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:21 AM

ఫుడ్‌ పార్శిలో.. ఏదైనా వస్తువో ఆర్డర్‌ చేస్తే.. అది సమయానికి రాకుండా కాస్త ఆలస్యమైనా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ టైమ్‌కు ఆర్డర్‌ను చేరవేయాలనే ఏకైక లక్ష్యంతో గిగ్‌వర్కర్లు పడే కష్టం అంతాఇంతా కాదు.

డెలివరీ బాయ్స్‌కి ‘ఆశ్రయ్‌’
Aashray gig workers centre

  • గిగ్‌వర్కర్ల కోసం విశ్రాంతి కేంద్రం..

  • గచ్చిబౌలిలో అమెజాన్‌ ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన సీఎంసీ కమిషనర్‌

  • దేశంలోనే తొలిసారి ఏర్పాటు అని ప్రకటన

  • శేరిలింగంపల్లిలో త్వరలో 4 కేంద్రాలు

  • వాటి ఏర్పాటుకు అమెజాన్‌ నిధులు..

  • నిర్వహణ బాధ్యతా ఆ సంస్థదే

  • దశలవారీగా అన్ని జోన్లలో ఈ కేంద్రాలు

  • ఏసీ గది, వాష్‌రూమ్‌, తాగునీటి సౌకర్యం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఫుడ్‌ పార్శిలో.. ఏదైనా వస్తువో ఆర్డర్‌ చేస్తే.. అది సమయానికి రాకుండా కాస్త ఆలస్యమైనా వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తుంటారు. కానీ టైమ్‌కు ఆర్డర్‌ను చేరవేయాలనే ఏకైక లక్ష్యంతో గిగ్‌వర్కర్లు పడే కష్టం అంతాఇంతా కాదు. అమెజాన్‌, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్‌ తదితర వేదికలపై పనిచేసే వీరంతా ఎండనక, వాననక రోడ్ల మీద తిరుగుతూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంటారు. మరి.. అవిశ్రాంతంగా శ్రమించే గిగ్‌వర్క్‌ల కోసమే ప్రత్యేకంగా నగరంలో విశ్రాంతి కేంద్రాలుంటే? అక్కడ వారు టీనో, కాఫీనో తాగి కాస్త సేదతీరే వీలుంటే? కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద అమెజాన్‌ సంస్థ ఇదే ఆలోచన చేసింది. గిగ్‌వర్క్‌ల సౌకర్యం కోసం గచ్చిబౌలిలోని జయభేరి ఎన్‌క్లేవ్‌ వద్ద ‘ఆశ్రయ్‌’ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.


సోమవారం ఈ కేంద్రాన్ని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌, అమెజాన్‌ ప్రతినిధులు బ్రియాన్‌ కెన్నర్‌, షాదాబ్‌ అన్వర్‌తో కలిసి సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎంసీ పరిధిలో గిగ్‌వర్కర్ల కోసం ఏర్పాటైన తొలి కేంద్రం ఇదేనని చెప్పారు. ఆశ్రయ్‌ కేంద్రంలో గిగ్‌వర్కర్ల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఏసీ గది, కాసేపు విశ్రాంతి తీసుకునే స్థలం, మొబైల్స్‌ చార్జింగ్‌ పాయింట్లు, సురక్షితమైన తాగునీరు, కాఫీ మెషిన్‌, వాష్‌రూమ్‌లతోపాటు ప్రథమ చికిత్స (ఫస్ట్‌ ఎయిడ్‌) సదుపాయాలున్నాయి.


గిగ్‌ వర్కర్ల హక్కులు, చట్టబద్ధమైన సమాచారాన్ని తెలియజేసేందుకు డిజిటల్‌ పోర్టర్లను అందుబాటులో ఉంచారు. స్థలాన్ని మునిసిపల్‌ యంత్రాం గం సమకూర్చిందని.. మౌలిక వసతుల కల్పన, నిర్వహణ బాధ్యతను పూర్తిగా అమెజాన్‌ సంస్థే చూసుకుంటుందని సృజన చెప్పారు. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేశాక తదుపరి ఆర్డర్‌ కోసం వేచిచూసేందుకు, భోజనం చేసేందుకు, కాసేపు సేదతీరడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.


గచ్చిబౌలిలోనే కాదు.. శేరిలింగంపల్లి జోన్‌లోని మిగతా 4 సర్కిళ్ల పరిధిలో మరో 4కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు కమిషనర్‌ వెల్లడించారు. సీఎంసీ పరిధిలోని మిగిలిన సర్కిళ్లలోనూ ఇతర సంస్థల సహకారంతో ఆశ్రయః కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నగరంలో సుమారు 2.5 నుంచి 3 లక్షల మంది వరకు డెలివరీ రంగంలో పనిచేస్తున్నారని అంచనా. అధిక ట్రాఫిక్‌, ఎక్కువ ఆర్డర్లు ఉండే ప్రాంతాల్లో గిగ్‌ వర్కర్లకు అందుబాటులో ఉండేవిధంగా ప్రధాన కూడళ్ల వద్ద వీటిని నిర్మిస్తున్నారు. దశలవారీగా అన్ని జోన్లలోనూ పూర్తిస్థాయిలో ఇలాంటి విశ్రాంతి గదులను ఏర్పాటవుతాయని సృజన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బీజేపీ, కాంగ్రెస్‌లకు ‘ఖైరతాబాద్‌’ తలనొప్పి!

హైదరాబాద్‌లో ‘బిల్ట్రస్ట్‌’ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:21 AM