Share News

బీజేపీ, కాంగ్రెస్‌లకు ‘ఖైరతాబాద్‌’ తలనొప్పి!

ABN , Publish Date - Sep 29 , 2026 | 05:09 AM

దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఖరారు కావటంతో ప్రధాన పార్టీల్లో గుబులు మొదలైంది. ప్రధాన పార్టీల తరఫున పోటీకి చాలామంది నేతలు టికెట్లు ఆశిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు ‘ఖైరతాబాద్‌’ తలనొప్పి!
Khairatabad bypoll

  • దానంపై అనర్హత వేటుతో ఉప ఎన్నిక ఖరారు..

  • కాంగ్రెస్‌ టికెట్‌ కోసం దానంకు పోటీగా విజయారెడ్డి

  • అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన..

  • పోటీలో ముగ్గురు నేతలు

  • బలమైన అభ్యర్థి కోసం అధిష్ఠానం సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఖరారు కావటంతో ప్రధాన పార్టీల్లో గుబులు మొదలైంది. ప్రధాన పార్టీల తరఫున పోటీకి చాలామంది నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో టికెట్ల కేటాయింపు అంశం ఆయా పార్టీ నాయకత్వాలకు తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిగా దానం నాగేందర్‌ను ఖరారు చేయడం లాంఛనమేనని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే.. మరో వైపు టికెట్‌ కోసం పోటీదారులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి రేసులోకి వచ్చారు.


గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన దానం నాగేందర్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిచిన విజయారెడ్డిపైనే గెలిచారు. ఇది తన తండ్రి పీజేఆర్‌ సీటు అని, దాని కోసమే నాడు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరానని విజయారెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో దానం నాగేందర్‌కు ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని అంటున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత టికె ట్‌ కోసం ఆయనను కలుస్తారని విజయారెడ్డి సన్నిహిత వర్గాలు తెలిపాయి. మరి కొందరు నేతలు కూడా టికెట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరిని కాదంటే ఎన్నికల్లో ఎలా దెబ్బతీస్తారోనని కాంగ్రెస్‌ పెద్దల్లో గుబులు మొదలైంది.


బలమైన అభ్యర్థి కోసం బీజేపీ సర్వే

ఖైరతాబాద్‌లో ఈసారైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి సర్వేకు సిద్ధమైంది. ఇక్కడ గతంలో ఒకసారి గెలిచిన పార్టీ సీనియర్‌ నేత చింతల రాంచంద్రారెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరి కీర్తిరెడ్డి, సినీనటి జీవిత టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందనే అంశంపై పార్టీ ఢిల్లీ నాయకత్వమే నేరుగా సర్వే చేయించబోతున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆరు బృందాలను రంగంలోకి దించబోతోదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.


‘జుబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో పలువురు సీనియర్‌ నాయకులు చెమటోడ్చారు. మరికొందరు మోసం చేశారు. వారి తీరుతో స్థానిక క్యాడర్‌ నిరాశకు గురైంది. అలాంటి పరిస్థితి ఖైరతాబాద్‌లో పునరావృతం కాకుండా చూడాలి’ అని పార్టీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నేతలు సూచించినట్లు తెలిసింది. దీంతో ఢిల్లీ పెద్దలు పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆగమేఘాలపై అంతర్గత సర్వే నిర్వహిస్తున్నారు. చింతల రాంచంద్రారెడ్డికే టిక్కెట్టు దక్కవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ, గత రెండుమూడు రోజుల్లో పరిస్థితి మారిపోయింది. తనకు టికెట్‌ ఇవ్వాలని సినీనటి జీవిత కోరినట్లు సమాచారం. తాను కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు జూటూరి కీర్తిరెడ్డి తెలిపారు. దీంతో టికెట్‌ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

తాగునీటి గండం గట్టెక్కేదెలా?

మరో వాహనాన్ని తప్పించబోయి లారీని ఢీకొన్న ఆటో.. నలుగురి మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu New

Updated Date - Sep 29 , 2026 | 05:09 AM