Share News

తాగునీటి గండం గట్టెక్కేదెలా?

ABN , Publish Date - Sep 29 , 2026 | 04:38 AM

లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు నానాటికీ పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఈసారి వానాకాలంలో నిండలేదు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని జలాశయాల్లో నీటినిల్వలు తగ్గిపోవడంతో నీటి కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది.

తాగునీటి గండం గట్టెక్కేదెలా?
Telangana water crisis

  • రాష్ట్రంలో రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలమట్టాలు

  • మూడు ఉమ్మడి జిల్లాల్లో మొదలైన తాగునీటి సమస్య

  • మరో ఏడు జిల్లాల్లో ఇప్పటివరకైతే ఇబ్బంది లేనట్లే..

  • సింగూరులో తగ్గిన నీటి నిల్వలు ఎల్‌నినో, నైరుతి దెబ్బతోనే..

  • రెండో పంటకు సాగునీటిని వదిలితే.. తాగునీటికి కష్టాలే

హైదరాబాద్‌, న్యూస్‌ నెట్‌వర్క్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు నానాటికీ పడిపోతున్నాయి. చెరువులు, కుంటలు సైతం ఈసారి వానాకాలంలో నిండలేదు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని జలాశయాల్లో నీటినిల్వలు తగ్గిపోవడంతో నీటి కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే.. రంగారెడ్డి, మెదక్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డిలో 50 శాతం గ్రామాలకు తాగునీటి సరఫరా సరిగా లేదు. మునిసిపాలిటీలతోపాటు గ్రామాల్లో కూడా బోర్లు అడుగంటుతున్నాయి. మిషన్‌ భగీరథ నీరు కూడా సక్రమంగా అందటంలేదు. నగర శివార్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు పడక పోవటంతో చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు.


అక్టోబరు, నవంబరు నెలల్లో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని అధికారులే స్వయంగా చెబుతున్నారు. భూగర్భ జలాలు పడిపోవటంతో.. 1,000 అడుగుల నుంచి 1,500 అడుగుల వరకు బోర్లు వేస్తున్నప్పటికీ నీరు రాని పరిస్థితి నెలకొంది. మెదక్‌ ఉమ్మడి జిల్లాలో కొరత కారణంగా తాగునీటి సరఫరా తగ్గింది. ఉదాహరణకు... సదాశివపేట పట్టణానికి రోజూ 80 లక్షల లీటర్ల నీళ్లు అవసరంకాగా.. ప్రస్తుతం 50 లక్షల లీటర్ల నీరే సరఫరా చేస్తున్నారు. అదీ రెండు రోజులకోసారి వదులుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గోదావరి నది పారుతున్నప్పటికీ.. ఎగువ ప్రాంతంలో నీటి లభ్యత, ప్రవాహం ఎక్కువగా లేదు. మిషన్‌ భగీరథ మోటార్ల మరమ్మతులు, లీకేజీలతో తాగనీటి సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆదిలాబాద్‌ పట్టణానికి ఫిబ్రవరి, మార్చి నెలలకు తాగునీటి లభ్యత కనిపించట్లేదు. ఇక.. వరంగల్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోప్రస్తుతానికి తాగునీటి కటకటలేదని గ్రామీణ తాగునీటి సరఫరా అధికారులు చెబుతున్నారు.


ప్రత్యామ్నాయాలపై..

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 56 శాతం గోదావరి బేసిన్‌, 43 శాతం కృష్ణా బేసిన్‌లో ఉంది. నదుల ప్రవాహం ప్రధానంగా జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ ఉండే నైరుతి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, తీవ్ర ఎల్‌నినో కారణంగా నైరుతి అనుకూలించక వర్షాలు సరిగా పడలేదు. సెప్టెంబరు 30తో వర్షాకాలం సీజన్‌ ముగిసిపోతోంది. దీంతో, ఈ సీజన్‌లో సాధారణంతో పోలిస్తే లోటు వర్షపాతం ఏర్పడింది. పంటలు గట్టెక్కుతాయా? లేదా? అనే ఆందోళన నెలకొంది. అయితే సాగునీటి కన్నా తాగునీటికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చే వేసవి పూర్తయ్యేవరకూ తాగునీటి ప్రణాళిక రూపొందించి ప్రజలకు ఎలాంటిఇబ్బందీ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.


దీంతో గ్రామీణ తాగునీటి సరఫరా శాఖతోపాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ప్రత్యామ్నాయ తాగునీటి ప్రణాళికలు రూపొందించాయి. గోదావరి, కృష్ణా బేసిన్ల పరిధిలోని జలాశయాల్లో ఉన్న నీటిలభ్యతపై అధికారులు దృష్టిసారించారు. బాసర నుంచి శ్రీరాంసాగర్‌, ఎల్లంపల్లి, కాళేశ్వరం, ఏటూరునాగారం మీదుగా భద్రాచలం వరకు గోదావరిలో ప్రస్తుతం నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గోదావరి బేసిన్‌లో నీటిలభ్యతకు కొంత భరోసా ఏర్పడింది. కృష్ణా బేసిన్‌లో జూరాల నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌ వైపు నీటి ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ భారీ వరద ప్రభావం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ లాంటి ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలే దిగువ ప్రాంతాల తాగునీటి అవసరాలకు కీలకంగా మారాయి


యాసంగికి నీరిస్తే..

ఖరీఫ్‌లోనే వద్దంటే వరి సాగుచేసిన రైతులు కొన్ని జిల్లాల్లో రెండో పంట (యాసంగి) సాగుకు కూడా సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో సాగునీటి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు నిజాంసాగర్‌ ప్రధాన నీటివనరు కాగా.. ప్రస్తుతం 12 టీఎంసీల నీరు నిల్వఉంది. మొత్తం సామర్థ్యం 17.80 టీంఎసీలు కాగా.. సాగునీటి సరఫరాతో నీటినిల్వలు తగ్గుతున్నాయి. ఈ ఖరీ్‌ఫలోనే బోధన్‌ నియోజకవర్గంలోని పంటలకు 2- 3 తడులకు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. బాన్సువాడ నియోజకవర్గానికి 3- 4 తడులకు నీరు అడుగుతున్నారు.


దీంతో 6 టీఎంసీల నీరు విడుదలచేయాల్సి వస్తుంది. మిగిలిన 6 టీఎంసీలనూ తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాల్సిందే! ఎందుకంటే సింగూరు నుంచి మిషన్‌ భగీరథ ద్వారా బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తాగునీటిని సరఫరా చేసే పరిస్థితిలేదు. ఇదిలాఉండగా నిజాంసాగర్‌ నుంచి కనీసం 3 టీఎంసీలు రెండో పంటకు వదులుతారనే ఆలోచనతో రైతులు ఉన్నారు. కానీ రెండో పంటకు నీరు వదిలితే తాగునీటి కొరత ఏర్పడుతుంది. ఈశాన్య రుతుపవనాలతో వర్షాలు పడతాయనే భరోసా కూడాలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల నుంచే నీటి ఎద్దడి ప్రారంభమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.


సింగూరుపై ఆందోళన

గ్రేటర్‌ హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ లాంటి ప్రధాన జలాశయాలు తీరుస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం రోజుకు సుమారు 585 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థంగా వినియోగిస్తే... 2027 వేసవి కాలం పూర్తయ్యేవరకు సరఫరా కొసాగించవచ్చని వాటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. అయితే సింగూరు జలాయశయం పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.


ఈ రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 30 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 4 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఈ జలాశయం తాగునీటిపై ఆధారపడి 2,395 గ్రామీణ ఆవాసాలు, 19 పట్ణణాలు ఉన్నాయి. మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో.. డెడ్‌ స్టోరేజీకి లోబడి ఉన్న 4 టీఎంసీల్లో 3 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని, ఇవి 80 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరులపై కూడా అధికారులు దృష్టిసారించారు. మల్లన్నసాగర్‌, శ్రీశైలం జలాశయాల నుంచి సింగూరు పరిధిలోని ఆవాస ప్రాంతాలకు నీటి తరలించే అవకాశాలను అంచనా వేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష

భట్టి చాంబర్‌ ముందు ఆందోళన

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 29 , 2026 | 04:39 AM