భట్టి చాంబర్ ముందు ఆందోళన
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:28 AM
సచివాలయంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు సోమవారం కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేయాలంటూ ఆందోళనకు దిగారు.
బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
మేం దాచుకున్న సొమ్ము ఇవ్వరా?.. రిటైర్డ్ ఉద్యోగుల నిలదీత
ఎన్నిసార్లు సచివాలయానికొచ్చినా భట్టి కలవడం లేదని ఆక్షేపణ
వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది.. పరిస్థితి కొంత ఉద్రిక్తం
బిల్లుల పత్రాలు తీసుకొని పంపించి వేసిన భద్రతా సిబ్బంది
హైదరాబాద్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు సోమవారం కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులను క్లియర్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. వీరిని అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఫలితంగా కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం కొంతమంది కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు మధ్యాహ్నం 3.30 గంటలకు రెండో అంతస్తులోని భట్టి చాంబర్ వద్దకొచ్చారు. మధ్యలోనే వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అనుమతి లేనిదే చాంబర్ వైపు పంపించడం కుదరదని చెప్పారు. తమకు కొన్నేళ్లుగా బిల్లులు క్లియర్ కావడం లేదని, తమ గోడును డిప్యూటీ సీఎంకు చెప్పుకొనేందుకే వచ్చామని కాంట్రాక్టర్లు, రిటైర్డు ఉద్యోగులు వారికి చెప్పారు.
డిప్యూటీ సీఎంను కలిసేందుకు తాము ఎన్నోసార్లు సచివాలయానికి వచ్చామని.. ఆయన కలవడం లేదని ఆక్షేపించారు. బిల్లులు రాకపోవడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగి 2024 ఆగస్టు 3న చనిపోయాడని, ఇప్పటివరకు ఆ ఉద్యోగికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల బిల్లులు క్లియర్ కాలేదని ఆయనకు సంబంధించిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, పిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా సొమ్ము సమయానికి చేతికి అందడం లేదన్నారు. ఆ డబ్బంతా తాము నెలా నెలా పోగు చేసి, జీపీఎఫ్, బీమాలో దాచుకున్నదేనని, దాన్నే తమకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను భద్రతాధికారులే భట్టి చాంబర్ వరకు తీసుకెళ్లాలంటూ కోరారు. కనీసం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా చాంబర్‌కైనా తీసుకెళ్లాలని అభ్యర్థించారు. చివరికి సెక్యూరిటీ అధికారులే వారి నుంచి బిల్లులకు సంబంధించిన పత్రాలను తీసుకున్నారు. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి చాంబర్‌లో ఇస్తామని సర్దిచెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కక్ష
Read Latest AP News And Telangana News And International News And Telugu News