16 నుంచి కొండగట్టు అంజన్న చందనోత్సవం
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:48 AM
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో 60 సంవత్సరాల అనంతరం హనుమాన్ చందనోత్సవం నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి.
60 ఏళ్ల తర్వాత తొలిసారి నిర్వహణ
స్వామివారిపై చందనం తొలగింపునకు ఏర్పాట్లు
ఐదు రోజుల పాటు ఉత్సవ విగ్రహ దర్శనమే
21వ తేదీ నుంచి 41 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనం
జగిత్యాల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో 60 సంవత్సరాల అనంతరం హనుమాన్ చందనోత్సవం నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా కొండగట్టులోని ఆంజనేయస్వామి రెండు తలలతో ఉంటారు. తూర్పు వైపు నారసింహస్వామి, ఉత్తరం వైపు ఆంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తారు. అయితే, స్వామివారి మూలవిరాట్టుపై దాదాపు ఆరు అంగుళాల మేర సింధూరం పేరుకుపోవడంతో ప్రస్తుతం భక్తులకు నిజరూప దర్శనం లభించడం లేదు.
ఈ నేపథ్యంలో సింధూరాన్ని తొలగించి, స్వామివారికి చందనోత్సవాన్ని నిర్వహించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రావి, జువ్వి, మర్రి, మేడి, దరిమి చెట్ల నుంచి కలప సేకరించి వాటితో సింధూరం తొలగిస్తారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తారు. సింధూరం తొలగించే 5 రోజుల పాటు భక్తులకు అంజన్న మూలవిరాట్టు దర్శనం ఉండదు. ఆలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కర్ర అంజనేయ స్వామి ఉత్సవ మూర్తి, వేంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీ అమ్మవారి దర్శనాలు మాత్రమే లభిస్తాయి. అనంతరం ఈనెల 21వ తేదీ నుంచి 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తారు. నిజరూప దర్శన కాలంలో రోజుకు 50వేల మంది చొప్పున సుమారు 20 లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు రూ.20 లక్షలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం
చందనోత్సవం ఏర్పాట్లపై ఇటీవల సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని, దర్శనం నుంచి తిరుగు ప్రయాణం వరకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం. ఆరు దశాబ్దాల అనంతరం జరగనున్న ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం
- సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల
శాస్త్రోక్తంగా చందనోత్సవం
కొండగట్టు ఆంజనేయ స్వామికి ఆగమశాస్త్రం ప్రకారమే చందనోత్సవం నిర్వహించనున్నాం. ఆలయంలో 60 ఏళ్ల తర్వాత చందనోత్సవం జరగనుంది. ఆంజనేయ స్వామి నిజరూపాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. అద్బుతమైన వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది.
- చిరంజీవి, దేవస్థాన ప్రధాన అర్చకుడు
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News