Share News

మత్తు వదిలి.. కొత్త జీవితంలోకి!

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:37 AM

చెడు సావాసాలు, అశాంతి అనే మత్తు ఊబిలో చిక్కుకుపోయి, అంధకారంలోకి జారిపోతున్న ఒక యువకుడి జీవితం.. కుటుంబం అందించిన అభయం, సరైన వైద్యం, కౌన్సెలింగ్‌తో సరికొత్త వెలుగులను చూసింది.

మత్తు వదిలి.. కొత్త జీవితంలోకి!
Ministry of Social Justice

  • చెడు సావాసాలతో గంజాయుకి బానిసైన పట్టభద్రుడు

  • ఐఆర్‌సీఏ, కుటుంబ సభ్యుల మద్దతుతో కోలుకున్న యువకుడు

  • నెలకు రూ.15వేల సంపాదన.. కుటుంబానికి ఆసరా

  • కరీంనగర్‌ యువకుడికి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రశంసలు

న్యూఢిల్లీ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): చెడు సావాసాలు, అశాంతి అనే మత్తు ఊబిలో చిక్కుకుపోయి, అంధకారంలోకి జారిపోతున్న ఒక యువకుడి జీవితం.. కుటుంబం అందించిన అభయం, సరైన వైద్యం, కౌన్సెలింగ్‌తో సరికొత్త వెలుగులను చూసింది. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన 25 ఏళ్ల గ్రాడ్యుయేట్‌ ‘నీల్‌’ (పేరు మార్చారు) విజయగాథ దేశవ్యాప్తంగా స్ఫూర్తిగా నిలుస్తోంది. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ సైతం ఇతని పరివర్తనను ప్రత్యేకంగా కొనియాడిందంటే అతని ప్రయాణం ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు... చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నీల్‌ జీవితం సాధారణంగానే సాగుతోంది.


అయితే చెడు సావాసాలు, కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి ఒత్తిళ్లు అతడిని పెడదోవ పట్టించాయి. సరదాగా మొదలైన అలవాటు క్రమేణా మద్యం, గంజాయి లాంటి వ్యసనాలకు బానిసగా మార్చేసింది. ఈ మత్తు అతడిని మానసికంగా, శారీరకంగా కుంగదీసింది. ఆత్మవిశ్వాసం కోల్పోయి అందరికీ దూరమయ్యాడు. కొడుకు పడుతున్న నరకాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. పరువు పోతుందనే భయం కంటే, కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే నాశనమైపోతున్నాడన్న ఆవేదన ఆ కుటుంబాన్ని నిద్రపోనివ్వలేదు. ఎలాగైనా తమ బిడ్డను ఈ వ్యసనం నుంచి రక్షించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో కుటుంబ సభ్యుల ప్రేమ, పట్టుదల నీల్‌ జీవితాన్ని మలుపు తిప్పాయి. గత మే నెల 22న కరీంనగర్‌లోని ప్రకృతి ఎన్విరాన్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఫర్‌ అడిక్ట్స్‌ (ఐఆర్‌సీఏ)ను వారు ఆశ్రయించారు. అక్కడి నిపుణులు నీల్‌ సమస్యను కూలంకషంగా అర్థం చేసుకున్నారు. అతనికి వైద్య చికిత్స అందిస్తూ.. బిహేవియరల్‌ థెరపీ, వ్యక్తిగత కౌన్సెలింగ్‌ ఇచ్చి మత్తుపై మానసికంగా పోరాడే ధైర్యాన్ని నూరిపోశారు.


మరోవైపు నీల్‌ తల్లిదండ్రులకు కూడా నిపుణులు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇచ్చి కుమారుడికి ఏ సమయంలో ఎలా అండగా ఉండాలో నేర్పించారు. సెంటర్‌లోని వైద్యులు, కుటుంబసభ్యుల అంకితభావం నీల్‌లో క్రమంగా మార్పు తెచ్చింది. పునరావాస కేంద్రంలో చికిత్స ముగిసిన తర్వాత నీల్‌కు వృత్తిపరమైన మార్గదర్శకత్వం (వొకేషనల్‌ గైడెన్స్‌) కూడా అందించారు. మత్తుకు పూర్తిగా స్వస్తి పలికిన నీల్‌ ఇప్పుడు కొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం నెలకు రూ. 15వేల వరకు సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నాడు. ఏ వ్యసనమైనా మనిషిని తాత్కాలికంగా ముంచెయ్యొచ్చు... కానీ సరైన సమయంలో లభించే వైద్య చికిత్స, ప్రొఫెషనల్‌ కౌన్సెలింగ్‌, అన్నింటికీ మించి కుటుంబం అందించే కొండంత అండ ఉంటే... చీకటి నుంచి వెలుగులోకి అడుగుపెట్టొచ్చని చెప్పడానికి నీల్‌ జీవితమే నిదర్శనమని కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ప్రశంసించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

అప్రాధాన్య పోస్టుకు జయేశ్‌ రంజన్‌

దీపావళి తర్వాత భారీ ప్రక్షాళన

ఆ జూనియర్‌ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 05:37 AM