Share News

Karimnagar: కార్మికులకు అండగా ఉంటాం

ABN , Publish Date - May 02 , 2026 | 12:22 AM

కరీంనగర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సమాజాభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రతకు అండగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

Karimnagar:   కార్మికులకు అండగా ఉంటాం

- బాలకార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి

- కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సమాజాభివృద్ధిలో కీలకమైన కార్మికుల ఆరోగ్యం, సామాజిక భద్రతకు అండగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో కార్మిక, ఉపాధిశిక్షణ, కర్మాగారాలశాఖ ఆధ్వర్యలో నిర్వహించిన మేడే వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్హులైన భవన నిర్మాణ కార్మికులను వెల్ఫేర్‌ బోర్డు కింద నమోదు చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, అందించే ఆర్థిక సహాయంపై అవగాహన సదస్సులను నిర్వహించాలని సూచించారు. బాయిలర్స్‌, ఫ్యాక్టరీ డిపార్టుమెంట్‌ అధికారులు తరచుగా పరిశ్రమలను తనిఖీ చేస్తూ ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. నమోదు కాని పరిశ్రమలను గుర్తించి చట్ట పరిధిలోకి వచ్చేలా చూడాలని అన్నారు. వీధి వ్యాపారులు, గిగ్‌, మున్సిపల్‌ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారిని అసంఘటిత కార్మికులుగా నమోదు చేయించాలని ఆదేశించారు. కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా అందుతున్న వైద్య సేవలను వివరిస్తూ కార్మికులు, యజమాని మధ్య మంచి వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. 18-40 ఏళ్ళ కార్మికులను పీఎంఎస్‌వైఎం కింద నమోదు చేయించాలని అన్నారు. బాల కార్మికులు లేని జిల్లాగా కరీంనగర్‌ను తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఉపాధికల్పనశాఖ అందిస్తున్న నైపుణ్య శిక్షణ సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని కార్మికులకు సూచించారు. నైపుణ్యాలు కలిగిన కార్మికులకు టామ్‌కామ్‌ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారని, దీన్ని సద్వినియోగ ంచేసుకోవాలని అన్నారు. మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కార్మికుల ఆరోగ్యం, కుటుంబ భద్రకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. మ్యాన్‌ హోల్‌లో మనుషులకు బదులు యంత్రాలు ఉపయోగించేలా చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ అశ్వినీతానాజీవాకడే, మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ , డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు మాట్లాడారు. అదనపు కలెక్టర్‌ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ కోల ప్రసాద్‌, జిల్లా ఎంప్లాయీమెంట్‌ అధికారి తిరుపతిరావు కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:22 AM