పోలీస్ కమిషనర్‌పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:35 PM
కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున నగదు వసూల్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడతానని తెలిపారు.
హైదరాబాద్, మార్చి 01: కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. సీపీ గౌస్ ఆలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తుల కోసం ఉపయోగిస్తున్నారని విమర్శించారు. TS 09 PA 4195 ఇన్నోవా వాహనం హైదరాబాద్‌లో తిరుగుతుందన్నారు. ఈ ఇన్నోవాకు ఇద్దరు కానిస్టేబుల్స్‌ను నియమించారని.. కరీంనగర్ వన్ టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ అశోక్ , ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ డ్రైవర్లగా ఉన్నారని తెలిపారు.
డీజీపీ సమాధానం చెప్పాలి..
ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ కరీంనగర్ సీపీ గౌస్ ఆలంకు మిత్రుడని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు. వికాస్ తండ్రి హైదరాబాద్ అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు. వికాస్ తండ్రి కోసం ఈ ప్రభుత్వ వాహనాన్ని వినియోగిస్తున్నారని వివరించారు. ఈ వాహనాన్ని సుభేదాలో పార్క్ చేస్తున్నారని.. గత 8 నెలల నుంచి పార్క్ చేస్తుంటే అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ సివిలియన్ కోసం ప్రభుత్వ వాహనాన్ని వాడడంపై డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
సీపీ భార్య కోసం..
ఇక కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సోదరుడు సైతం ప్రభుత్వ వాహనాన్ని వాడుతున్నారని ఆరోపించారు. ఈ ఇన్నోవా వాహనం నెంబర్ TS 09 PA 5601 అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కారు రోజూ చలిమేడ వెళ్లి.. కరీంనగర్ సీపీ బ్రదర్‌ను కాలేజ్‌లో డ్రాప్ చేస్తున్నారని తెలిపారు. సీపీ గౌస్ ఆలం సతీమణికి కరీంనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఎలా వచ్చిందో అందరికి తెలుసునన్నారు. ఆమె కోసం ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు.
రూ. కోటి తీసుకున్న సీపీ..!
ఇల్లీగల్ పనులు చేస్తున్న కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో సీపీ గౌస్ ఆలం పెద్ద ఎత్తున నగదు వసూలు చేస్తున్నారని.. ఆ ఆధారాలు అన్ని త్వరలోనే బయట పెడుతానని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు చెందిన బియ్యం సరఫరాలో అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఈ అక్రమాలకు పాల్పడే వారి వద్ద నుంచి కరీంనగర్ సీపీ నగదు వసూలు చేస్తున్నారన్నారు. ఈ నగదు వసూల్ చేయించేందుకు ఏసీపీ విజయ్ కుమార్, సీఐ సృజన్ రెడ్డిని సీపీ నియమించారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో 337 మంది హోంగార్డులను బదిలీ చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. హోంగార్డులను బదిలీ చేసేందుకు సీపీ గౌస్ ఆలం రూ. కోటి తీసుకున్నారన్నారు.
మంత్రి జోక్యంతో..
పెద్దపల్లిలో హోంగార్డ్స్‌ను బదిలీ చేసేందుకు సీపీ సిద్ధమైతే మంత్రి శ్రీధర్ బాబు జోక్యంతో అవి ఆగిపోయాయని గుర్తు చేశారు. జనవరి 8వ తేదీన ఎస్ఎన్ ఫ్రైడ్ మాల్‌కు నిరభ్యంతర నివేదిక (NOC) ఇచ్చేందుకు ఆ మాల్ యజమాని వద్ద నుంచి రూ. 25 లక్షలు సీపీ గౌస్ ఆలం వసూల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రికి, మాజీ ఎమ్మెల్యేకు ఒక్క గన్ మెన్ కూడా లేరని.. కానీ కరీంనగర్ సీపీకి మాత్రం ఎస్కార్ట్ వాహనాలతో పాటు 2 + 2 గన్‌మెన్స్ పెట్టుకున్నారని వివరించారు. ఈ సీపీ నివాసంలో 20 మంది కానిస్టేబుల్స్ పని చేస్తున్నారని చెప్పారు.
ఐపీఎస్ అధికారుల అసోసియేషన్‌కు..
కరీంనగర్ సీపీపై సీఎస్, డీజీపీ చర్యలు తీసుకోకపోతే 15 రోజుల తరువాత అన్ని వాస్తవాలు బయట పెడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అందరి సాక్షిగా అన్నీ వీడియోలు బయట పెడుతానని ఆయన స్పష్టం చేశారు. తాను ఆ వీడియోలు బయట పెట్టిన తర్వాత బాధపడ వద్దంటూ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్‌కు ఆయన సూచించారు. తాను ఆ వీడియోలు బయట పెడితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తలదించుకునే పరిస్థితి వస్తుందన్నారు.
సీఎం రేవంత్‌కి చురకలు..
తాను చెప్పిన వాస్తవాలపై విచారణ జరిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, ఇంటిలిజెన్స్ ఐజీని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నగదు తెచ్చి ఇవ్వనందుకు ఒక ఎస్ఐని సీపీ గౌస్ ఆలం సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో.. తెలియకపోతే ఎట్లా అంటూ హోం శాఖను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి చురకలంటించారు.
కుటుంబ సమేతంగా..
ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పరువు తీస్తుంది మాత్రం కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు. 15 రోజుల్లో హుజూరాబాద్ ఏసీపీ, జమ్మికుంట సీఐ ఏం పనులు చేస్తున్నారో అవన్నీ కూడా బహిర్గతం చేస్తానని ప్రకటించారు. డాబా హోటల్స్‌లో కుటుంబ సమేతంగా కరీంనగర్ సీపీ భోజనం చేసి నగదు చెల్లించడం లేదని విమర్శించారు. ఆ నగదు సైతం ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐ చెల్లించారంటూ సీపీ గౌస్‌పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాష్ట్ర రాజకీయాల్లో టైగర్ జోన్.. నల్గొండ జిల్లా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
కాకాణి గోవర్ధన్ రెడ్డిది కాకి గోల: ఎమ్మెల్యే సోమిరెడ్డి
Read Latest TG News And Telugu News