కాన్పుకెళితే కడుపు కోతలే..
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:30 AM
గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు.
జగిత్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) గర్భిణులకు సాధారణ కాన్పు చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నా పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.కొందరు ప్రైవేటు వైద్యులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ శాతం ఆపరేషన్ల ద్వారానే డెలివరీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొంత కాలంగా ఎక్కువ శాతం శస్త్ర చికిత్సల ద్వారానే కాన్పులు చేశారని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్లు చేస్తే, ప్రైవేటు ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు తక్కువగా అవుతున్నాయి ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు చేయడంతో మహిళలు భవిష్యత్తులో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఫధనార్జనే ధ్యేయంగా...
కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ధనార్జనే ధ్యేయంగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. సాధారణ కాన్పులు చేయడం ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. మొదటి కాన్పును కచ్చితంగా సాధారణమే చేయాలని, ఒకవేళ సీ సెక్షన్ ద్వారా డెలివరీ చేస్తే అందుకు తగిన కారణాలను వైద్య ఆరోగ్య శాఖకు చెప్పాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో ప్రైవేటు వైద్యులు ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో శస్త్ర చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.1.20 వరకు పరిస్థితిని బట్టి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఫజిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో ఒక ప్రధాన ఆసుపత్రి, ఒకటి మాతా శిశు సంరక్షణ కేంద్రం, 4 తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, 19 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, 151 ఆరోగ్య ఉప కేంద్రాలు, 24 గంటలు పనిచేసే 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఆరోగ్య సేవలను ప్రభుత్వం అందిస్తోంది. వీటికి తోడు సుమారు 300 వరకు ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో 80 శాతం సిజేరియన్లు చేస్తున్నారు. సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. కానీ చాలా మంది వైద్యులు ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నారు. కొంతమంది గర్భిణులు తేదీలు, ప్రత్యేక రోజుల కోసం సిజేరియన్లు చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ నార్మల్ డెలివరీలు కాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
ఫసిజేరియన్లతో దుష్పరిణామాలు..
సిజేరియన్లతో తల్లీబిడ్డలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తోంది. రక్తస్రావం అధికమైనా, ఇతరత్రా సమస్యలు తలెత్తినా ప్రాణాపాయంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనాల్సి రావచ్చు. గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్టు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో అప్పుడప్పుడు తీవ్ర కడుపు నొప్పి సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని సందర్భాల్లో గర్భసంచి తొలగించే పరిస్థితి ఏర్పడవచ్చు. శస్త్ర చికిత్స సమయంలో గర్బ సంచి పక్కనే ఉండే మూత్రాశయం దెబ్బతింటే రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ఫకట్టడి చేస్తేనే మేలు..
సాధారణ కాన్పులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయి. రాష్ట్రంలోనే అధిక సిజేరియన్లు చేస్తున్న జాబితాలో జగిత్యాల జిల్లా ఉందని, ఇందులో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. గర్భిణులకు శస్త్ర చికిత్స చేయడానికి విధిగా అనుమతి తీసుకోవాలన్న నిబంధనను ముందుకు తెస్తున్నారు. సుఖ కాన్పులను ప్రోత్సహించడంలో భాగంగా ఆయుష్మాన్ భారత్ ఎన్‌హెచ్‌పీఎం (కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం) తీసుకొచ్చారు. మొత్తం కాన్పుల్లో 30 శాతం మాత్రమే సిజేరియన్లు జరగాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రైవేటులో జరుగుతున్న శస్త్ర చికిత్సలకు సంబంధించిన నివేదికలను ప్రతీ నెల అందించాలని ఆదేశించింది. నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తే సిజేరియన్లు తగ్గే అవకాశాలున్నాయి.
ఫ సుఖ ప్రసవాలతో ప్రయోజనాలు...
సాధారణ ప్రసవాలతో తల్లీబిడ్లలు ఆరోగ్యంగా ఉంటారు. మహిళలు రెండు రోజుల్లోనే ఎప్పటిలా పనులు చేసుకోవచ్చు. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. భవిష్యత్తులో రుగ్మతలకు గురికాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. పుట్టిన బిడ్డకు సైతం మొదటి గంటలో తల్లి పాలు అందించవచ్చును. ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీ అయితే ప్రోత్సాహక నగదు సైతం అందుతుంది.
సాధారణ ప్రసవాలు పెంచేందుకు కృషి
- డాక్టర్ జైపాల్‌రెడ్డి, జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచడానికి కృషి చేస్తున్నాము. అత్యవసరమైతే తప్ప సిజేరియన్లు చేయొద్దని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులకు సూచించాం.
జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు ప్రసవాల వివరాలు
---------------------------------------------------------------------------------
ఆసుపత్రులు సిజేరియన్లు సాధారణం మొత్తం
ప్రైవేట్ 5,947 1,009 6,956
ప్రభుత్వ 4,237 2,337 6,574
---------------------------------------------------------------------------------
మొత్తం..................13,530..........10,184................3,346
---------------------------------------------------------------------------------