ప్రజావసర స్థలాల్లో భవనాలు.. సీజ్ చేసిన హైడ్రా
ABN , Publish Date - Feb 05 , 2026 | 07:58 AM
నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన మణికొండలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా సీజ్ చేసింది. హైదరాబాద్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంటోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల స్థలాలను స్వాధీనం చేసుకుంది.
హైదరాబాద్ సిటీ: మణికొండ మునిసిపాలిటీ పరిధి వెంకటేశ్వర కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవనాలను హైడ్రా(HYDRAA) బుధవారం సీజ్ చేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ప్లాట్లుగా విభజించి, నకిలీ క్రమబద్ధీకరణ సర్టిఫికెట్లు(ఎల్‌ఆర్‌ఎస్) సృష్టించి అనుమతులు తీసుకున్నట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎండీఏ అనుమతితో వెంకటేశ్వరకాలనీ లే అవుట్ అభివృద్ధి చేశారు. ఇందులో ప్రజావసరాలకు 300 చదరపు గజాల చొప్పున నాలుగు ప్లాట్లు కేటాయించారు.
ఆ నాలుగు ప్లాట్లతో పాటు పక్కనే ఉన్న మరి కొంత స్థలాన్ని కలిపి.. మొత్తం 1500 చ.గలుగా చూపించి నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ సృష్టించారు. ఆ వివరాలు సమర్పించి మణికొండ మునిసిపాల్టీలో గ్రౌండ్ ప్లస్ ఐదంతస్తుల భవన నిర్మాణానికి ఓ వ్యక్తి అనుమతి పొందారు. ఇదే లే అవుట్‌లో పార్కు కోసం కేటాయించిన 2 వేల చ.గల స్థలంలో మరో వ్యక్తి ఏకంగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకున్నాడు. అవి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలని గుర్తించిన మణికొండ మునిసిపల్ అధికారులు తాము ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులు గతేడాది రద్దు చేశారు.
మరో భవన నిర్మాణ అనుమతి రద్దు చేయాలని హెచ్‌ఎండీఏకు లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ భవనాలు నిర్మిస్తున్న స్థలాల యాజమాన్యపు హక్కుపై హైడ్రా విచారణ జరుగుతోంది. పనులు నిలిపివేయాలని న్యాయస్థానం చెప్పలేదన్న సాకుతో భవన నిర్మాణ పనులు శరవేగంగా చేపడుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఆ స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించింది. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలతో కలిసి భవనాలను సీజ్ చేసింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రజావసర స్థలాలుగా పేర్కొంటూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News