‘మై ఫాదర్ బాలయ్య’ రచయిత.. వైబీ సత్యనారాయణ కన్నుమూత
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:18 AM
‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత వైబీ సత్యనారాయణ (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన ఆత్మకథాత్మక రచనకు జాతీయ స్థాయి గుర్తింపు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తక రచయిత వైబీ సత్యనారాయణ (82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు యేలుకంటి బాలయ్య సత్యనారాయణ. ఆయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగపల్లి గ్రామం. సత్యనారాయణ రాసిన ‘మై ఫాదర్ బాలయ్య’ ఆత్మకథాత్మక కుటుంబ చరిత్ర పుస్తకం జాతీయ స్థాయిలో అమితాదరణ పొందింది. కబాలి సినిమా మొట్టమొదటి సన్నివేశంలో నటుడు రజనీకాంత్ ఈపుస్తకాన్ని చదువుతున్నట్టు దర్శకుడు పా రంజిత్ చిత్రీకరించడంతో దానిపై మరింత చర్చ జరిగింది.
నిజాం రాజ్యంలో, ఆ తరువాత తెలంగాణ గ్రామీణ స్థితిగతులను, దళితుల జీవన చిత్రాన్ని, సామాజిక అసమానతలను ఈ పుస్తకం కళ్లకు కడుతుంది. ఇదే పుస్తకాన్ని ‘మా నాయన బాలయ్య’ పేరుతో పి.సత్యవతి తెలుగులోకి అనువదించారు. మాజీ మంత్రి, తొలితరం తెలంగాణ ఉద్యమకారిణి టీఎన్ సదాలక్ష్మి జీవిత చరిత్రను ‘సదాలక్ష్మి- ది పొలిటికల్ రెబల్’ పేరుతో సత్యనారాయణ రాశారు. సికింద్రాబాద్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన, నిజాం కళాశాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పూర్తిచేశారు. యాకుత్పురాలోని ధర్మవంత్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాలలో 25 ఏళ్లకు పైగా ప్రిన్సిపాల్గా సేవలందించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఏర్పాటులోనూ ముఖ్య పాత్ర పోషించారు. సత్యనారాయణ అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం బన్సీలాల్పేట శ్మశాన వాటికలో జరుగుతాయని ఆయన పెద్ద కుమార్తె మాధవి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోవా డ్రగ్ పెడ్లర్ కాంటాక్ట్ లిస్ట్లో వెయ్యిమంది తెలుగోళ్లు !
27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!
Read Latest AP News And Telangana News And International