గోవా డ్రగ్ పెడ్లర్ కాంటాక్ట్ లిస్ట్‌లో వెయ్యిమంది తెలుగోళ్లు !
ABN , Publish Date - Oct 15 , 2026 | 06:05 AM
తెలంగాణ ఈగల్స్ ఫోర్స్ అధికారులు గోవాలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. గోవా నుంచి తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బడా నెట్‌వర్క్‌లోని ఇద్దరు కీలక డ్రగ్ పెడ్లర్లను మంగళవారం అరెస్టు చేశారు.
ఈగల్ ఫోర్స్ భారీ ఆపరేషన్.. గోవాలో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఈగల్స్ ఫోర్స్ అధికారులు గోవాలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. గోవా నుంచి తెలుగు రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ బడా నెట్‌వర్క్‌లోని ఇద్దరు కీలక డ్రగ్ పెడ్లర్లను మంగళవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలోని ఓ పెడ్లర్ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 1000 మంది ఉండగా వారి వివరాలను అధికారులు జల్లెడ పడుతున్నారు. గత నెలలో హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రోస్టేషన్ వద్ద, ఇటీవల అల్లాపూర్ ప్రాంతంలో అరెస్టు చేసిన వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈగల్ బృందం గోవా వెళ్లింది. అక్కడ గోవాలోని అంజునా ప్రాంతంలో ప్రితేష్ నారాయణ బోర్కర్ అలియాస్ బాబు అలియాస్ కాళీ(36), నార్త్ గోవాలో బషరత్ అహ్మద్ ధగ్గా అలియాస్ బిలాల్‌ను మంగళవారం అరెస్టు చేసింది.
ప్రితేష్కు కేవలం తెలంగాణలోనే 800 మందికి పైగా కస్టమర్ల నెట్వర్క్ ఉన్నట్టు అతని కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా గుర్తించారు. అలాగే, ఏపీలో 200మంది కస్టమర్ల నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రీతేష్ కాంటాక్ట్ లిస్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1000 మంది కాంటాక్ట్‌లతోపాటు పలు ఆన్లైన్ లావాదేవీలు, వాట్సాప్ చాట్లు, కొన్ని స్ర్కీన్షాట్లను కనుగొన్నారు. దీంతో ఈ కాంటాక్ట్ లిస్టులపై అధికారులు దృష్టి పెట్టారు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిలో ఎంతమంది మత్తుమందులు కొంటున్నారు? వారి కోసమే డ్రగ్స్ కొంటున్నారా? తమ ఫోన్ ద్వారా డబ్బు పంపించి ఇతరులకు డ్రగ్స్ ఇస్తున్నారా ? అనే విషయాలను పరిశీలిస్తున్నారు.
ప్రతి కాంటాక్ట్ నెంబర్, ఆర్ధిక లావాదేవీల వివరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. కాగా, ప్రితేష్పై 2022లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ పరిధిలో సింథటిక్ డ్రగ్స్ సరఫరా కేసు నమోదైంది. రాంగోపాల్‌పేట్, లాలాగూడ, మియాపూర్, అల్లాపూర్ పోలీసు స్టేషన్లలోనూ ప్రితేష్పై మత్తుమందుల కేసులున్నాయి. ఇక, ప్రితేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బషరత్ అహ్మద్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద 13ఎల్‌ఎ్‌సడీ బ్లాట్లు, 8 ఎక్స్టసీ పిల్స్, 100 గ్రాముల చర్‌సను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
టీజీఎస్పీడీసీఎల్కు 4 నాణ్యతా ధ్రువీకరణలు
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి
సింగరేణిని అవినీతి గనిగా మార్చారు
Read Latest AP News And Telangana News And International