టీజీఎస్పీడీసీఎల్కు 4 నాణ్యతా ధ్రువీకరణలు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:56 AM
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) అంతర్జాతీయ ప్రమాణాల నిర్వహణలో సరికొత్త మైలురాయిని అధిగమించింది.
నాణ్యమైన విద్యుత్ పంపిణీకి అంతర్జాతీయ గుర్తింపు
డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా అందుకున్న సీఎండీ జితేష్ వి.పాటిల్
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) అంతర్జాతీయ ప్రమాణాల నిర్వహణలో సరికొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ కార్యకలాపాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకుగాను నాలుగు ప్రతిష్ఠాత్మక నాణ్యతా ధ్రువీకరణలు పొందింది. అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా సంస్థ సీఎండీ జితేష్ వి.పాటిల్ ఈ పురస్కారాలు అందుకున్నారు. కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణ, అంతర్గత నియంత్రణ, పర్యవేక్షణ ప్రక్రియలకు ఐఎ్సవో 9001 గుర్తింపు దక్కిందని యాజమాన్యం ప్రకటించింది.
ఐటీ నెట్వర్క్, డేటా పరిరక్షణ, సైబర్ ముప్పు నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎ్సవో 27001 లభించింది. విద్యుత్ సరఫరా, మరమ్మతు పనులకు అవసరమైన సామగ్రిని స్టోర్స్లో క్రమపద్ధతిలో నిల్వ చేయడం, అవసరమైనపుడు అందుబాటులోకి తేవడం కోసం జపాన్లో అభివృద్ధి చేసిన 5ఎస్ అమలు చేయడం ద్వారా మరో గుర్తింపు పొందినట్లు సంస్థ పేర్కొంది. వినియోగదారుల సేవలకు క్వాలిటీ మార్క్ ధ్రువీకరణలు లభించిందని తెలిపింది. నాణ్యతను ధ్రువపత్రాలకే పరిమితం చేయకుండా ప్రతి ప్రక్రియలో క్రమశిక్షణ, జవాబుదారీతనం పాటిస్తూ వినియోగదారుల విశ్వాసం పెంచుకోవడమే లక్ష్యమని సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
2 లక్షల మందితో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్కు తరలిరండి
సింగరేణిని అవినీతి గనిగా మార్చారు
Read Latest AP News And Telangana News And International