2 లక్షల మందితో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:32 AM
ఓట్ చోరీని నిరసిస్తూ దసరా తర్వాత.. హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో భారీ మార్చ్, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ వెల్లడించారు.
దసరా తర్వాత నిర్వహిస్తాం
ఓట్‌చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
ఎమ్మెల్సీ ఎన్నికలపై 23న సీఎం సమావేశం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఓట్ చోరీని నిరసిస్తూ దసరా తర్వాత.. హైదరాబాద్‌లో రెండు లక్షల మందితో భారీ మార్చ్, బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ వెల్లడించారు. దక్షిణాదిన రెండు రాష్ట్రాల్లో ఈ సభలను నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని, అందులో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బుధవారం, గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు రాహుల్‌గాంధీ స్వయంగా షూ లేస్ కట్టారని గుర్తు చేస్తూ.. అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న నేత మహిళా జర్నలిస్టులను అవమానించారంటూ కొందరు చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసిందే రాజీవ్‌గాంధీ అని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశం ప్రమాదంలో పడిందని, సంపన్నులకు రూ. లక్షల కోట్ల రుణాల మాఫీ జరగగా.. సామాన్యులకు మాత్రం ఒరిగిందేమీ లేదని విమర్శించారు. 15 ఏళ్లుగా నిలిచిపోయిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఎన్నికలను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని, కార్మికుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 23న సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు. పార్టీలో కష్టపడ్డవారికి న్యాయం చేసే ఉద్దేశంతోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యం అవుతోందని, దసరాకు అటు, ఇటుగా దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి ఎవరి కబ్జాలో ఉందనే అంశంపై విచారణ జరుగుతోందన్నారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సింగరేణి గర్జనకు అర్థంలేదని, కేసీఆర్ పదేళ్లపాటు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి టైంపాస్ చేశారని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
న్యూయార్క్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత
Read Latest AP News And Telangana News And International