తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:27 AM
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగు తుందని బ్రిటన్ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
మా ప్రభుత్వ విధానాలు స్థిరంగా కొనసాగుతాయి: సీఎం రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత ఉంటుందని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగు తుందని బ్రిటన్ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావర ణం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని ఆయన వారికి తెలిపారు. రాబోయే రోజుల్లో తయారీ రంగాన్ని భారీగా విస్తరించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. బ్రిటన్‌లోని యార్క్‌షైర్ ప్రాంతానికి చెందిన మేయర్ల నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం.. బుధవారం ఇక్కడఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం రేవంత్‌తో సమావేశమైంది. అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, వైద్య ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్స్టైల్స్, నైపుణ్యాభివృద్థి, పరిశోధన రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు.
ఈ భాగస్వామ్యాన్ని ప్రత్యక్ష వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, విద్యాసంస్థల మధ్య సహకారంగా మార్చేందుకు త్వరలో మరోసారి తెలంగాణలో పర్యటించాలని భావిస్తున్నట్లు సీఎంకు తెలిపారు. కాగా.. ‘యూకే - ఇండియా సీఈటీఏ- రీజినల్ సినర్జీస్’ పేరుతో యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్ ఈ సమావేశంలో ఆవిష్కరించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మి ట్-2026కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరు కావాలని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దీర్ఘకాలిక అభివృద్థి ప్రణాళిక ‘తెలంగాణ రైజింగ్-2047’ గురించి వారికి వివరించారు.
ఇక.. ఈ సమావేశానికి ముందు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బ్రిటన్ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సందర్శించాలని వారిని ఆహ్వానించారు. ఈ భేటీలో యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ సీఈవో కిషోర్ జయరామన్, హైదరాబాద్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ ప్రతినిధులు, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, సీఎస్ సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
న్యూయార్క్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు
మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే
ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు
Read Latest AP News And Telangana News And International