మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:09 AM
మొదటి కాన్పులో కవల పిల్లలు పుట్టినా.. నిబంధనల ప్రకారం రెండో కాన్పుకు కూడా పూర్తి వేతనంతో కూడిన 180 రోజు ల ప్రసూతిసెలవులు మంజూరు చేయాల్సిందేనని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కవలలు పుట్టడం సహజ ప్రక్రియ
మాతృత్వ హక్కులను కుదించలేం: హైకోర్టు
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మొదటి కాన్పులో కవల పిల్లలు పుట్టినా.. నిబంధనల ప్రకారం రెండో కాన్పుకు కూడా పూర్తి వేతనంతో కూడిన 180 రోజు ల ప్రసూతిసెలవులు మంజూరు చేయాల్సిందేనని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కవలలు పుట్టడం సహజ ప్రక్రియ అని, నిబంధనల పేరుతో మాతృత్వ హక్కులను కుదించలేమని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను టీఎస్సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్థితప్రజ్ఞ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిని టీఎస్సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలు వి. నర్మద సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మఖ్దంపూర్ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న నర్మద, తన రెండో కాన్పులో ప్రసూతి సెలవుల కోసం సెప్టెంబరు 21న దరఖాస్తు చేసుకోగా.. ప్రభుత్వం తిరస్కరించింది.
జీవో 152, ప్రాథమిక నియమం 101 ప్రకారం ఇద్దరు పిల్లలు లేని సమయంలోనే ప్రసూతి సెలవుల నిబంధనలు వర్తిస్తాయని, ఇద్దరు పిల్లలు ఉన్నందున కుదరదని చెప్పింది. ఈ మేరకు ఉట్కూరు విద్యాశాఖ ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను సవాలు చేస్తూ బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు.. బాధితురాలు ఉద్యోగంలో చేరకముందు ఆమెకు మొదటి కాన్పులో కవలలు జన్మించారని, అయినా రెండో కాన్పులో కూడా తప్పకుండా మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాల్సిందేనని ఉత్తర్వులిచ్చింది. నిబంధనల పేరుతో మాతృత్వ హక్కులను కుదించలేమని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నర్మదకు 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేసి, పూర్తి వేతనం చెల్లించాలని విద్యాశాఖను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని యువకుడి మృతి.. 19 మందికి అస్వస్థత
బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!
Read Latest AP News And Telangana News And International