ప్రపంచ తెరపై తెలంగాణ వైభవం
ABN , Publish Date - Oct 15 , 2026 | 04:55 AM
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ‘ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్-2.0’లో తెలంగాణ వైభవాన్ని కళ్లకు కట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. సదస్సుకు వచ్చే అతిథులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర చరిత్రను తెలియజేయనుంది.
గ్లోబల్ సమ్మిట్ 2.0ను గొప్పగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు
రామప్ప గుడి వైభవాన్ని, సాంకేతికతను కళ్లకు కట్టే నమూనా
కాకతీయ కళాతోరణం, ఖిల్లాల వివరాలు..
మేడారం జాతర, బతుకమ్మ, పేరిణి, తెలంగాణ సంప్రదాయ వాద్యాల విశేషాలు
మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులపై ప్రదర్శనలు
32 పేజీలతో‘గ్లోబల్ సమ్మిట్-తెలంగాణ పెవిలియన్’ కాన్సెప్ట్
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ‘ఇన్వెస్ట్ గ్లోబల్ సమ్మిట్-2.0’లో తెలంగాణ వైభవాన్ని కళ్లకు కట్టేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. సదస్సుకు వచ్చే అతిథులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులకు రాష్ట్ర చరిత్రను తెలియజేయనుంది. ఇందుకోసం 5 విభాగాలను ప్రధానంగా ఎంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు, నిర్మాణ వైభవంతో పాటు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళిక, మూసీ పునరుజ్జీవనం వరకు.. అన్నింటినీ వివరించే ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ‘గ్లోబల్ సమ్మిట్ 2.0 - తెలంగాణ పెవిలియన్ కాన్సెప్ట్’ పేరుతో 32 పేజీలతో కూడిన నివేదికను సంబంధిత అధికారులు రూపొందించారు. ఈ నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నారని, ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే పనులు మొదలుపెట్టే అవకాశం ఉందని తెలిసింది. ప్రతిపాదిత కాన్సెప్ట్ ‘ఆంధ్రజ్యోతి’కి లభించింది. దాని ప్రకారం..
తాకి చూసి.. అనుభూతి పొందేలా..
ఈసారి సమ్మిట్‌ను నిరుటి కంటే భిన్నంగా నిర్వహించాలని, పెట్టుబడులను అధికంగా రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే.. సమ్మిట్ కాన్సె్‌ప్టను విభిన్నంగా, వినూత్నంగా రూపొందించారు. ఫొటోలు, నమూనాలు, సమాచార బోర్డులకే పరిమితమయ్యే ప్రదర్శనలకు భిన్నంగా.. సందర్శకులు స్వయంగా తాకి చూడగలిగేలా, అనుభూతి పొందేలా వినూత్న ఏర్పాట్లు చేయాలనే ప్రతిపాదనను ఈ కాన్సె్‌ప్టలో పొందుపరిచారు. పెవిలియన్ లోకి అడుగుపెట్టగానే తెలంగాణ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా కాకతీయ కళాతోరణం తరహా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాతి శిల్పాలు, అలంకరణలు, ఇండో- యూరోపియన్ శైలిలో ఆర్చ్‌లు, జరోఖా బాల్కనీలతో ఈ ప్రవేశ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు ప్రత్యేక ప్రదేశాలనూ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రాచీన నాగరికతకు వారసత్వంగా నిలిచిన తెలంగాణ.. ఆధునిక రాష్ట్రంగా సాధిస్తున్న ప్రగతిని ఒకే ప్రాంగణంలో పరిచయం చేసేలా ఈ విభాగాన్ని రూపొందించనున్నారు.
రామప్ప గుడి నిర్మాణ రహస్యాలు..
తెలంగాణ చారిత్రక కట్టడాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పెవిలియన్ లో ప్రధాన ఆకర్షణగా చూపించనున్నారు. ఆ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన తేలికపాటి ఇటుకలు, పునాది సాంకేతికత గురించి సందర్శకులకు వివరించేందుకు ప్రత్యేక నమూనాలను రూపొందించాలని కాన్సెప్ట్ నివేదికలో ప్రతిపాదించారు. ఇందులో భాగంగా నీటిలో తేలే ఇటుకల నమూనాలను ఉంచి సంద ర్శకులే వాటిని నీటిలో వేసి చూడగలిగేలా ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. అలాగే దేవాలయ పునాదిలోని ఇసుక పొరలు, గోపుర నిర్మా ణంలోని అంతర్గత భాగాలను డిజిటల్ సాంకేతికతతో విడమరిచి చూపించేలా ‘ఏఆర్ కట్ అవే’ను ప్రతిపాదించారు.
అలాగే.. గోల్కొండ, వరంగల్, భువనగిరి, ఖమ్మం, ఎల్గందల్, దోమకొండ, రాచకొండ, మెదక్ ప్రాంతాల్లో ఉన్న ఖిల్లాల (కోటల) చరిత్రను ఆధునిక ప్రదర్శనా పద్థతుల్లో ఆవిష్కరించాలని ప్రతిపాదించారు. ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా వాటి విశేషాలను వివరించాలని, పెద్ద తెరపై కోటలను సందర్శిస్తున్న అనుభూతి కలిగించేలా ఏర్పాట్లు చేయాలని నివేదికలో పేర్కొన్నారు. గోల్కొండ కోటలో ప్రసిద్థి చెందిన ధ్వని ప్రతిధ్వని విశేషాన్ని ప్రత్యక్షంగా చూపించాలని.. శిథిలమైన కోట భాగాలను ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో పునర్నిర్మించి చూపించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రాచీన మెట్ల బావుల నిర్మాణ నైపుణ్యాన్ని వివరించేందుకు నమూనా బావులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
బతుకమ్మ నుంచి మేడారం వరకు.. పండుగల సందడి
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగకు పెవిలియన్ లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపాదించారు. సంద ర్శకులు నడుస్తున్నప్పుడు నేలపై పూల బతుకమ్మ నమూనాలు వికసిస్తున్నట్లుగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలనే ప్రతిపాదన ఉంది. అలాగే.. పేరిణి శివతాండవ నృత్యాన్ని త్రీడీ రూపంలో ప్రదర్శించాలని సూచించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర వైభవాన్ని ప్రదర్శించాలని పేర్కొన్నారు. పండుగ పాటల ధ్వనులతో సందర్శకులకు మంచి అనుభూతిని ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు.
ఇండో-ఇస్లామిక్ వాస్తు శైలి.. ‘నూర్’ ప్రత్యేకత
తెలంగాణలోని ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్పాన్ని పరిచయం చేసేందుకు ‘నూర్’ పేరుతో ప్రత్యేక వెలుగు-నీడల గదిని రూపొందించాలని నివేదికలో పేర్కొన్నారు. పైగా, కుతుబ్‌షాహీ సమాధులు, గోల్కొండ, చార్మినార్ వంటి కట్టడాల జాలీ తెరల డిజైన్ల నుంచి ప్రేరణ పొందిన నమూనాలను ఇందులో ఉపయోగించనున్నారు. తెలంగాణకే ప్రత్యేకమైన.. పోచంపల్లి, ఇక్కత్ చేనేతకు ప్రత్యేక స్థానం కల్పించాలని ప్రతిపాదించారు. ‘వీవ్ అండ్ బీ వోవెన్ ఇన్’ అనే కాన్సె్‌ప్టతో సందర్శకులు ఏఐ ఆధారిత స్ర్కీన్ ముందు నిలబడగానే పోచంపల్లి చీర లేదా ఇకత్ కోటు ధరించినట్లుగా తమ రూపాన్ని చూసుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ చిత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపించి డిజిటల్ జ్ఞాపకంగా అందించాలనేది మరో ఆలోచన. సంప్రదాయ చేనేతను ఆధునిక డిజిటల్ అనుభవంతో అనుసంధానించడం ద్వారా యువత, విదేశీ సందర్శకుల్లో తెలంగాణ వస్త్ర కళపై ఆసక్తి పెంచవచ్చన్నది భావన.
మూసీ, ఫ్యూచర్‌సిటీపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర అభివృద్థికి సంబంధించి.. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్‌సిటీ వంటి ప్రధాన ప్రాజెక్టులను ప్రదర్శించాలని ప్రతిపాదించారు. ‘వాక్ త్రూ ది ఫ్యూచర్’ పేరుతో భవిష్యత్ తెలంగాణలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగించేలా ఒక ప్రత్యేక ప్రదర్శనను రూపొందించాలని కాన్సెప్ట్ నివేదికలో పేర్కొన్నారు. సమ్మిట్ చివర్లో 360 డిగ్రీల కోణంలో ఒక డోమ్‌ను ఏర్పాటుచేసి దాని ద్వారా తెలంగాణ వారసత్వ కట్టడాల ఆకృతులు ఆధునిక నగర స్కైలైన్గా మారుతున్నట్లుగా చూపించాలని ప్రతిపాదించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మేడిగడ్డ ఏడో బ్లాకు కూల్చి.. మళ్లీ కట్టాల్సిందే
Read Latest AP News And Telangana News And International