Share News

పండుగ పూట.. ధరల మంట

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:35 AM

ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొనే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు హడలెత్తిస్తున్నాయి. వంటింటి సరుకుల రేట్లు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు.

పండుగ పూట.. ధరల మంట
Telangana price hike

  • వంటింటి బడ్జెట్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్‌

  • వర్షాభావంతో తగ్గిన పంట దిగుబడులు, కూరగాయల ఉత్పత్తి..

  • పెరిగిన నిత్యావసరాల ధరలు

  • ఇబ్బందుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు..

  • స్పెషల్‌ బస్సుల పేరిట ఆర్టీసీ బాదుడుతో మరింత భారం

  • వానలు పడకపోతే ధరలు ఇంకా పైపైకి..

  • అక్రమ నిల్వలను అరికడితే తగ్గే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొనే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు హడలెత్తిస్తున్నాయి. వంటింటి సరుకుల రేట్లు అమాంతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షాలు సరిగా పడక జలాశయాల్లో నీరు అడుగంటిపోతోంది. ఫలితంగా పంటల దిగుబడి తగ్గి, నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ప్రధానంగా నీటి లభ్యత లేక ఈసారి వరి దిగుబడి బాగా తగ్గిపోయింది. పప్పు ధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేరకు లేకపోవడంతో వ్యాపారులు ఉన్నవాటిపై అడ్డగోలుగా రేట్లు పెంచుతున్నారు.


గత నెలలో హోల్‌సేల్‌లో కిలో రూ.65 ఉన్న హెచ్‌ఎంటీ జైశ్రీరాం బియ్యం ధర ప్రస్తుతం రూ.95కి చేరింది. ఒక్క నెలలో రూ.30 పెరుగుదల. కిలో రూ.45 ఉన్న సోనామసూరి రైస్‌ తాజాగా హోల్‌సేల్‌లో రూ.70 పలుకుతోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో జూలై-సెప్టెంబరు మధ్య రిటైల్‌ బియ్యం ధరలు 13.3 శాతం పెరిగాయి. కిరాణం దుకాణాల్లో బియ్యం రేట్లే కాదు.. పప్పుల ధరలు సైతం పైపైకి ఎగబాకుతున్నాయి. సెప్టెంబరులో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో శనగపప్పు ధర రూ.76 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.96కు పెరిగింది. అలాగే రూ.96 ఉన్న కిలో పెసరపప్పు ధర రూ.110కి పెరిగింది. కందిపప్పు, చక్కెర, ధనియాలు, జీలకర్ర, సర్ఫ్‌లు, సబ్బులు.. అన్నీ పెరిగాయని చాదర్‌ఘాట్‌లోని హోల్‌సేల్‌ వ్యాపారి జగన్‌మోహన్‌ తెలిపారు. పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులయ్యింది.


హైదరాబాద్‌ నగరంలో నలుగురు ఉండే ఒక సాధారణ కుటుంబానికి నెలకు బియ్యం, ఉప్పు, పప్పులకు రూ.5000, పాలు, కూరగాయలకు రూ.3,000, ఇతర అవసరాలకు రూ.1500 చొప్పున సగటున రూ.9,500 వరకు ఖర్చవుతోంది. అయితే, పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ.12వేలు అయినా సరిపోవటం లేదని ముషీరాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి వంశీ తెలిపారు. ఉద్యోగరీత్యా తాను హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నానని, నెలవారీ బడ్జెట్‌ పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానని వాపోయారు. నెలలో సగం రోజులకే పర్సు ఖాళీ అవుతుండడంతో స్నేహితుల దగ్గరి నుంచి అప్పు తీసుకుని కుటుంబ పోషణను నెట్టుకురావాల్సి వస్తోందన్నారు. దసరా సెలవుల్లో వినోదం, విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్న వారు వాటిని వాయిదా వేసుకుంటున్నారు.


ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాల ధరలూ పైపైకి..

ఎలకా్ట్రనిక్‌ ఉపకరణాలు కూడా తామేం తీసిపోం అన్నట్లుగా ధరల పెరుగుదలలో నిత్యావసరాలతో పోటీ పడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టా్‌పలు, ఏసీల ధరలు బాగా పెరిగాయి. మార్కెట్‌ పరిశోధన సంస్థ డిజిటల్‌స్టాక్‌.ఏఐ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య ఆన్‌లైన్‌లో ల్యాప్‌టా్‌పల సగటు విక్రయ ధరలు 32శాతం, ఏసీల ధరలు 11 శాతం, స్మార్ట్‌ఫోన్ల ధరలు 7శాతం, వాషింగ్‌ మెషిన్ల రేట్లు 3 శాతం పెరిగాయి. గతేడాది అక్టోబరు నెల పండుగ విక్రయాలతో పోల్చితే ఈ ఏడాది అక్టోబరులో ల్యాప్‌టా్‌పల సగటు ధరలు 41శాతం, స్మార్ట్‌ఫోన్ల ధరలు 10 శాతం అధికంగా ఉన్నాయి. రాగి, ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్‌ వంటి ముడి పదార్థాలు, మెమరీ చిప్‌లు తదితర ఎలకా్ట్రనిక్‌ భాగాల ధరలు అధికం కావడంతో రేట్లు అనివార్యంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.


ఆర్టీసీ స్పెషల్‌ బస్సుల్లో అదనపు చార్జీలు

పెరిగిన ఈ ధరలతో సామాన్యుల జీవితం ఇప్పటికే భారం కాగా, పండుగలకు ఊళ్లకు వెళ్దామనుకుంటే ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన టికెట్ల ధరలు ఆ భారాన్ని మరింత పెంచుతున్నాయి. బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి స్పెషల్‌ బస్సుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వ సూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో 15-20 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడకపోతే ఆహారధాన్యాల ధరలు మరో 10-20 శాతం పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఏటా పండుగల సీజన్‌లో నిత్యావసరాల వినియోగం పెరుగుతుందని, ఈసారి డిమాండ్‌ 30 శాతం వరకు తగ్గిందని తెలిపారు. కాగా సరుకుల అక్రమ నిల్వలను అరికడితే ధరలు కొంతమేరకు సాధారణస్థితికి చేరుకుంటాయని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువరు అభిప్రాయపడుతున్నారు.


ఏది చూసినా పిరమే

పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారుతోంది. మార్కెట్‌లో ఏది అడిగినా రేటు ఎక్కువగానే ఉంటోంది. గతంలో ధరలు పెరిగినా ఏదో ఒక సీజన్‌లో కనిపించేవి. ఆ తర్వాత పరిస్థితులు సాధారణమయ్యేవి. కానీ, ఇప్పుడు అలా లేదు. ఎక్కడో యుద్ధం అంటే ఇక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి.

- శ్రీలత, గృహిణి

సంతోషం... సగమే

గొర్రె తోక బెత్తెడులాగా.. మధ్యతరగతి జీవుల వేతనాలు కూడా అలాగే ఉంటున్నాయి. నా బడ్జెట్‌ చూసుకుంటే నెలకు రూ.4వేల లోటులోకి పోయింది. అదీ ఈ 15 రోజుల్లోనే. కిరాణా, కూరగాయల ఖర్చు నెలకు రూ.2000-2500 పెరిగింది.

-రామారావు, అకౌంటెంట్‌

కొనుగోళ్లు తగ్గి నష్టాలు

ఈసారి వర్షాలు సరిగా పడకపోవడంతో రైతులు ఆశించిన మేరకు కూరగాయ లను పండించలేకపోయారు. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. కొనుగోలుదారులు తగ్గిపోవడంతో వ్యాపారంలో కూడా నష్టాలే ఉంటున్నాయి. గత అమావాస్య నుంచి కూరగాయల కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి.

-అనూష, కూరగాయల వ్యాపారి, బోయిన్‌పల్లి


నెల రోజుల్లో ధరల పెరుగుదల

సెప్టెంబరు (హోల్‌సేల్‌)

అక్టోబరు (హోల్‌సేల్‌)

జైశ్రీరామ్‌ రైస్‌ క్వింటాల్‌ రూ.6,500

రూ.9,500

సోనామసూరి రైస్‌ క్వింటాల్‌ రూ.4500

రూ.7000

చక్కెర కిలో రూ.46-48

రూ.53-55

పెసరపప్పు కిలో రూ.96-98

రూ.110-112

కంది పప్పు కిలో రూ.123-125

రూ.140-145

ఉల్లిగడ్డ కిలో రూ.50-55

రూ.60-65


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

ఎకరానికి రూ.10 వేల పరిహారం

మేడిగడ్డ ఏడో బ్లాకు కూల్చి.. మళ్లీ కట్టాల్సిందే

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 04:48 AM