Share News

బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 05:00 AM

బరువు తగ్గేందుకు (వెయిట్‌ లాస్‌) ప్రజలు ఆన్‌లైన్‌లో లభించే అనుమతి లేని మందులను, ప్రయోగ దశలో ఉన్న పెప్టైడ్‌ ఉత్పత్తులను వాడవద్దని తెలంగాణ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ ప్రామాణికాల సంస్థ (టీజీ సేఫ్‌) సూచించింది.

బరువు తగ్గుతారంటూ నాసిరకం మందులు!
unapproved weight loss drugs

  • అనుమతి లేని, ప్రయోగ దశలో ఉన్న మందుల విక్రయం

  • మానవ వినియోగానికి కాదనే లేబుళ్లతో ఆన్‌లైన్‌లో అమ్మకం

  • ప్రాణాలకే ప్రమాదమని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): బరువు తగ్గేందుకు (వెయిట్‌ లాస్‌) ప్రజలు ఆన్‌లైన్‌లో లభించే అనుమతి లేని మందులను, ప్రయోగ దశలో ఉన్న పెప్టైడ్‌ ఉత్పత్తులను వాడవద్దని తెలంగాణ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ ప్రామాణికాల సంస్థ (టీజీ సేఫ్‌) సూచించింది. వాటితో ప్రాణాలకే ప్రమాదమని పేర్కొంది. అనుమతి లేని ఇటువంటి మందులను రోగులకు సూచించినా, విక్రయించినా, అందించినా సంబంధిత వైద్యులపై, ఆన్‌లైన్‌ నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం ఒక ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కొందరు రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్లు (వైద్యులు) బరువు తగ్గించే చికిత్సల కోసం ‘రెటాట్రూటైడ్‌’, ‘ఓర్ఫోర్గ్లిప్రాన్‌’ వంటి అనుమతి లేని మందులను రోగులకు ఇస్తున్నట్లు టీజీ ేసఫ్‌ దృష్టికి వచ్చింది.


అలాగే టెలిగ్రామ్‌, సోషల్‌ మీడియా, కొన్ని ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు, హెల్త్‌కేర్‌ సిబ్బంది ‘రెటాట్రూటైడ్‌’, ‘టెసామోరెలిన్‌’ వంటి పెప్టైడ్‌లతో పాటు బీపీసీ-157, జీహెచ్‌కే-సీయూ వంటి నాసిరకం ప్రయోగ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆన్‌లైన్‌ సంస్థలు సద రు ఉత్పత్తులపై పరిశోధన రసాయనాలు (రీసెర్చ్‌ కెమికల్స్‌), మానవ వినియోగానికి కాదనే లేబుళ్లు వేసి విక్రయిస్తున్నప్పటికీ.. వాటితో పాటే మందులను స్వయంగా డోసేజ్‌ చేసుకునేలా ఇంజెక్షన్‌ వైల్స్‌, గైడ్‌ పుస్తకాలను పంపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ లేదా చట్టవిరుద్ధ వనరుల నుంచి లభించే ఈ ఇంజెక్షన్‌ ఉత్పత్తులు ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు, స్టెరిలిటీ పరీక్షలు దాటి రావు. ఇవి వాడటం వల్ల శరీరంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, ఇతర సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. టెలిగ్రామ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ, తప్పుడు లేబుళ్లు ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.


లేబుల్‌ పైన ఉన్న వివరాలకు, వైల్‌ లోపల ఉన్న మందుకు ఎలాంటి సం బంధం ఉండటంలేదు. ఇలాంటి ఇంజెక్షన్లను వైద్యు ల పర్యవేక్షణ లేకుండా సొంతంగా ఆన్‌లైన్‌ సూచనలతో వేసుకోవడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని టీజీ సీఫ్‌ హెచ్చరించింది. సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడెస్కో), టీజీ సేఫ్‌ అనుమతులు లేని ఎలాంటి వెయిట్‌ లాస్‌ మందులను రోగులకు ప్రిస్ర్కిప్షన్‌లో రాయకూడదు, విక్రయించకూడదు. మానవ వినియోగానికి కాదు అన్న ఉత్పత్తులను ఔషధాలుగా పరిగణించరాదు.


డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్స్‌ యాక్ట్‌, 1940 నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా బరువు తగ్గడం లేదా ఊబకాయం నివారణ కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన సంబంధిత వైద్యులను మాత్రమే సంప్రదించాలని, అనుమతి పొందిన ఫార్మసీల ద్వారానే మందులు పొందాలని ప్రజలకు టీజీ సేఫ్‌ విజ్ఞప్తి చేసింది. అనుమతి లేని నాసిరకం ఔషధాలు, ఆన్‌లైన్‌ విక్రయాలు, చట్టవిరుద్ధ ఔషధాల గురించి తెలిస్తే టీజీ సేఫ్‌ డ్రగ్‌ వింగ్‌ టోల్‌ఫ్రీ నంబరు 1800-599- 6969కు ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

పండుగ పూట.. ధరల మంట

ప్రపంచ తెరపై తెలంగాణ వైభవం

మేడిగడ్డ ఏడో బ్లాకు కూల్చి.. మళ్లీ కట్టాల్సిందే

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 05:00 AM