న్యూయార్క్ కంటే హైదరాబాద్ తక్కువేం కాదు
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:23 AM
న్యూయార్క్, లండన్, టోక్యో వంటి దేశ రాజధానుల కంటే హైదరాబాద్ ఎందులోనూ తక్కువ కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ పోటీ అమరావతి సహా బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలతో కాదన్నారు.
నగరం అభివృద్ధికి బహుళ సంస్కృతులే బలం..
యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
ఉన్నత వ్యక్తుల విజయాలను వారికి చెప్పాలి
ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు చేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి
సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవంలో సీఎం
హైదరాబాద్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): న్యూయార్క్, లండన్, టోక్యో వంటి దేశ రాజధానుల కంటే హైదరాబాద్ ఎందులోనూ తక్కువ కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తమ పోటీ అమరావతి సహా బెంగళూరు, చెన్నై, ముంబయి నగరాలతో కాదన్నారు. దేశంలోని ఇతర నగరాలు అభివృద్ధి చెందడం కూడా తమకు సంతోషమేనని, ఎక్కడ పెట్టుబడులు వచ్చినా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. బుధవారం హైటెక్స్‌లో సమాఖ్య చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభ కార్యక్ర మంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో కరెన్సీ నోట్లు, నాణేలు అందుబాటులో లేని కాలంలో ప్రజలు వస్తుమార్పిడి పద్ధతి ద్వారా పరస్పరం సహకరించుకునే వారని, అప్పటి వ్యవస్థల మాదిరిగానే నేటి ఆధునిక యుగంలోనూ సమాఖ్యలు, వాణిజ్య సంస్థల అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు.
యువత ఉద్యోగాల కోసం ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి సొంతంగా పరిశ్రమలు స్థాపించి, వేల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకున్న వారి విజయగాథలను కొత్త తరానికి పరిచయం చేయాలని, వారి అనుభవాలు యువతకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కాపు వర్గానికి చెందిన వి.హనుమంతరావు, పి.శివశంకర్, డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య వంటి నాయకులు, బీజేపీలో కె.లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నేతలు ఎదిగారని గుర్తుచేశారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, పవన్‌కల్యాణ్ వంటి వారు సినీ రంగంతోపాటు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్న భారతీయ స్టార్ట్‌పల విజయాలను కూడా యువతకు పరిచయం చేయాలన్నారు. ముఖ్యంగా అంతరిక్ష రంగంలో ఎలాన్ మస్క్ వంటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సంస్థ స్టార్‌లింక్‌తో పోటీ పడే స్థాయికి తెలంగాణ కంపెనీ స్కైరూట్ ఎదిగిందని పేర్కొన్నారు.
వికసిత్ భారత్‌కు రాష్ట్రాల భాగస్వామ్యం
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీ యాలు చేయాలని, మిగతా సమయాల్లో రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకా శాల కల్పనే ప్రధాన లక్ష్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌కు 400 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న బహుళ సంస్కృతుల నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇరానీ సంస్కృతి ప్రభావం, ఇతర ప్రాంతాల ప్రజల రాకతో నగరం విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిందని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా తెలంగాణ అభివృద్థిలో భాగస్వాములయ్యారని తెలిపారు.
దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. మహిళలకు కేవలం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కాకుండా, వారు సొంతంగా వ్యాపారాలు నిర్వహించి ఆదాయం సంపాదించేలా అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన మంచి విధానాలను తాము రాజకీయ కారణాలతో రద్దు చేయబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కె.లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, వి. హనుమంతరావు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఏపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాం చక్రవర్తి, మున్నూరు కాపు ఫౌండేషన్ ట్రస్ట్ ప్రతినిధి సత్తు మల్లేష్, జస్టిస్ భవాని ప్రసాద్, స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు చందన పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెస్టారెంట్లో కలుషిత ఆహారం తిని యువకుడి మృతి.. 19 మందికి అస్వస్థత
మొదటి కాన్పులో కవలలు పుట్టినా.. రెండో కాన్పులో ప్రసూతి సెలవులకు అర్హులే
ప్రైవేటు వీడియోలు బయటపెడతానని బెదిరించి.. రూ. 6.71 లక్షలు వసూలు
Read Latest AP News And Telangana News And International