Share News

అధిక లాభాల పేరుతో మోసం

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:14 AM

అధిక లాభాలు, చిట్‌ఫండ్స్‌ పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో... మంగళవారం రాత్రి యూనిక్‌ మర్కంటైల్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ, అహ్మదాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్‌ రాయ్‌(69)ను ఆదిలాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

అధిక లాభాల పేరుతో మోసం
Unique Mercantile fraud

  • యూనిక్‌ మర్కంటైల్‌ ఇండియా ఎండీ అరెస్టు

  • జనం సొమ్ముతో హోటళ్లు, మియాపూర్‌లో 400 ప్లాట్లు, బీబీనగర్‌లో 200ఎకరాల కొనుగోలు

  • దేశవ్యాప్తంగా 10 వేల మంది బాధితులున్నట్లు అంచనా

  • తెలంగాణలో రూ.వందల కోట్ల మోసం

ఆదిలాబాద్‌ టౌన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): అధిక లాభాలు, చిట్‌ఫండ్స్‌ పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించి మోసానికి పాల్పడిన కేసులో... మంగళవారం రాత్రి యూనిక్‌ మర్కంటైల్‌ ఇండియా లిమిటెడ్‌ ఎండీ, అహ్మదాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్‌ రాయ్‌(69)ను ఆదిలాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు యూనిక్‌ ఎస్‌ఎంసీఎస్‌ జోనల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. యూనిక్‌ మర్కంటైల్‌, యూనిక్‌ ఎస్‌ఎంసీఎస్‌ సంస్థల ద్వారా తెలంగాణలో రూ. వందల కోట్ల మేర మోసం జరిగినట్లు ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 10 వేల మంది బాధితులు ఉండొచ్చన్నారు. ఈమేరకు బుధవారం పోలీసు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియాకు వివరాలను వెల్లడించారు.


నిందితులు ఏజెంట్ల ద్వారా వార్షిక, నెలవారీ కిస్తీలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల పేరుతో ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించారని, వీటికి అధిక రాబడితో పాటు, ప్లాట్లు ఇస్తామని నమ్మించారని ఎస్పీ తెలిపారు. గడువు ముగిసినా మెచ్యూరిటీ మొత్తాలు చెల్లించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థలకు సంబంధించి 14 కేసులు నమోదైనట్లు గుర్తించారు. నిందితులు జనం సొమ్ముతో బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌, జైపూర్‌, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో హోటళ్లు, మియాపూర్‌లో సుమారు 400 ప్లాట్లు, బీబీనగర్‌ ఎయిమ్స్‌ పరిసరాల్లో సుమారు 200 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు. కాగా ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు 2వేల మంది సభ్యులతో రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్లు వెల్లడైందన్నారు. రాజ్‌కుమార్‌రాయ్‌ గతంలో మెడికల్‌ కంపెనీ ఏర్పాటు, హోటళ్లలో ఉద్యోగాలు, విదేశాల్లో ఉపాధి కల్పిస్తామని మోసాలకు పాల్పడిన అంశంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

టీజీఎస్‌పీడీసీఎల్‌కు 4 నాణ్యతా ధ్రువీకరణలు

గోవా డ్రగ్‌ పెడ్లర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో వెయ్యిమంది తెలుగోళ్లు !

27 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు!

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 06:14 AM