Share News

యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం: మంత్రి తుమ్మల

ABN , Publish Date - Oct 14 , 2026 | 03:09 PM

రానున్న యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, అక్టోబర్14: రానున్న యాసంగిలో వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాల్చకుండా పశుగ్రాసంగా వినియోగించేలా చూడాలని సూచించారు. అవసరమైతే ఖరీఫ్ పశుగ్రాసాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. పశుగ్రాసం అందుబాటులో ఉండేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఎల్‌ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ వ్యవసాయంలో ఏఐ, శాటిలైట్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. జర్మనీ ప్రతినిధులతో డిజిటల్ వ్యవసాయ సాంకేతికతపై చర్చలు జరిపినట్లు వివరించారు. శాటిలైట్ డేటాతో నేలలోని పోషకాల లభ్యత అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకేసారి 70 లక్షల మంది రైతులకు మట్టి పోషకాలపై సమాచారం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు.


ప్రతి 12 రోజులకు ఎరువుల వినియోగంపై సమగ్ర సమాచారం అందించే అవకాశం ఉందని అన్నారు. అధిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కొత్త సాంకేతికత కచ్చితత్వం, విశ్వసనీయతను శాస్త్రీయంగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు.


ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. నేల ఆరోగ్య పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపునకు డిజిటల్ వ్యవసాయం ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమీక్షలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, యాంత్రీకరణ, గోదాముల నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరిక..

సీజేపీ నేతలను జైలుకు పంపడం పిరికిపంద చర్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 03:16 PM