భార్య చచ్చిపోతాననడంతో!
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:51 AM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. ఆర్మీ 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో 16 ఏళ్లపాటు హవల్దార్‌గా పనిచేసి..
ఆయుధాల చోరీ కేసులో నిజం చెప్పిన నిందితుడు
కేసు తీవ్రతను మల్లేశ్ భార్యకు తెలిపిన పోలీసులు
నిజం చెప్పకపోతే చచ్చిపోతా.. మల్లేశ్‌కు భార్య బెదిరింపు
ఉద్యోగం నుంచి తొలగించిన ఆర్మీ అధికారులను
ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఆయుధాల చోరీ
లోతైన విచారణకు కస్టడీలోకి తీసుకునే యోచన
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. ఆర్మీ 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో 16 ఏళ్లపాటు హవల్దార్‌గా పనిచేసి.. ఇటీవల తొలగింపునకు గురైన ఉప్పుటోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు ఈ చోరీకి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించి.. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే నిందితుడి నుంచి పోలీసులు నిజం రాబట్టడంలో అతని భార్య సహకారం కూడా ఉన్నట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మల్లేశ్‌ను ప్రశ్నించినప్పుడు సమాధానాలు దాటవేయడంతోనే అతనిపై అనుమానాలు బలపడ్డాయి.
అయినా.. అతణ్ని ఏమీ అనకుండా పిలిచినప్పుడు విచారణకు రావాలని చెప్పారు. అనంతరం ఈ నెల 8వ, 9వ తేదీల్లో విచారణకు రావాలని పిలవగా అతడు పట్టించుకోలేదు. అప్పటికే నిందితుడు అతనేనని నిర్ధారించుకున్న పోలీసులు మల్లేశ్ భార్యకు, ఆమె తండ్రికి విషయం చెప్పారు. కేసు చాలా తీవ్రమైనదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో తీవ్రతను అర్థం చేసుకున్న మల్లేశ్ భార్య.. అతణ్ని నిలదీసింది. ‘‘చోరీ చేసి ఉంటే నిజం చెప్పు.. తప్పు ఒప్పుకో. లేదంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం’’ అని భర్తను హెచ్చరించించినట్లు తెలిసింది. దాంతో చేసిన తప్పును, దాచిన ఆయుధాలు, బుల్లెట్ల జాడను భార్యకు, తన మామకు మల్లేశ్ వెల్లడించాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్, నాగర్‌కర్నూల్ పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని తన స్వగ్రామంలో గడ్డివాము కింద గుంతలో పాతిపెట్టిన ఆయుధాలు, బుల్లెట్లను స్వాఽధీనం చేసుకున్నారు. కాగా, ఆయుధాల గది తాళాలను పగలగొట్టడానికి ఉపయోగించిన ఇనుప రాడ్డును కంటోన్మెంట్‌లోని బాలాజీనగర్‌లో ఉన్న తన ఇంట్లో శనివారం ఉదయం బొల్లారం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితుణ్ని మరింత లోతుగా విచారించడానికి మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకుంటామని, ఈ మేరకు న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఆర్మీ అధికారుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని..
16 ఏళ్లపాటు హవల్దార్‌గా పనిచేసిన తనను విధుల నుంచి తొలగించడంతో ఆర్మీ అధికారులపై మల్లేశ్ కక్ష పెంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విధుల్లో నిర్లక్ష్యం, అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 30న మల్లేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించగా.. సర్వీస్ ఇంకా మూడేళ్లు ఉండగానే తొలగించిన అధికారులపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఆయుధాల చోరీకి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఒకటి, రెండు ఆయుధాలు చోరీ చేస్తే.. పెద్దగా పట్టింపు ఉండదని, అధికారులు కౌంటింగ్‌లో మేనేజ్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో ఎంత ఎక్కువ ఆయుధాలు చోరీ చేస్తే అంత ఎక్కువగా ఆర్మీ ఉన్నతాధికారుల ఇమేజ్‌కు డ్యామేజ్ జరుగుతుందని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కోటెలో 12 ఆయుధాలను, యామినేషన్ గదిలో ఉన్న మందుగుండు సామగ్రిని చోరీ చేశాడు. అయితే ఆగస్టు 30వ తేదీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సుమారు 5 గంటలపాటు మద్రాస్ రెజిమెంట్‌లో భారీ చోరీ జరుగుతున్నా.. అధికారులు, సిబ్బంది ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఆర్మీ అధికారుల భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా ఆస్తి పన్ను
నీళ్లియ్యమని నన్ను అడగొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News