Share News

‘బరువు’ దోపిడీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:41 AM

భారత్‌లో పెరుగుతున్న ఊబకాయ సమస్యతో వెయిట్‌లాస్‌ మార్కెట్‌ విస్తరిస్తోంది. సోషల్‌ మీడియా ప్రకటనలను నమ్మి అనధికార చికిత్సలు తీసుకోవద్దని, నిపుణుల సలహాతో బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు.

‘బరువు’ దోపిడీ
Obesity in India

  • బరువు తగ్గించుకునేందుకు ఏటా భారతీయులు చేస్తున్న ఖర్చు 3 లక్షల కోట్లు

  • సన్నబడాలన్న ఆరాటానికి భారీ మార్కెట్‌..

  • వెయిట్‌లాస్‌ చికిత్స పేరుతో కొత్త దందాలు

  • సోషల్‌ మీడియాలో ప్రచారంతో గాలం

  • దేశంలో 4.1 కోట్లకుపైగా పిల్లల్లో ఊబకాయం

  • 2 రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య

  • కనీస శారీరక శ్రమకు పిల్లలు దూరం

  • వారిలో ఫ్యాటీలివర్‌, బీపీ, మధుమేహం ముప్పు

  • మారిన జీవనశైలి.. పెరుగుతున్న స్ర్కీన్‌ టైమ్‌

  • వేగంగా బరువు తగ్గడం అంటే మళ్లీ పెరగడమే

  • అలాంటి వాటిని నమ్మొద్దంటున్న నిపుణులు

  • ఈ విపరీత ధోరణిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ‘చెమటోడ్చి వ్యాయామం చేసే పనిలేదు.. నోరుకట్టుకుని ఉండనవసరం లేదు.. ఒక నెలలో ఐదారు కిలోలు బరువు తగ్గకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం.. యూట్యూబ్‌ షార్ట్స్‌, ఇన్‌స్టా రీల్స్‌ ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలే. మారిన జీవనశైలితో బరువు పెరిగిపోయిన యువత, పొట్టతో సతమతమవుతున్న మధ్యవయస్కుల బలహీనతలను సొమ్ము చేసుకోవడానికి అడ్డగోలుగా పుట్టుకొచ్చిన నకిలీ స్లిమ్మింగ్‌ సెంటర్ల దందా ఇది. అధిక బరువు సమస్య లక్షల కోట్ల వ్యాపారానికి సరుకుగా మారింది. డైట్‌ క్లినిక్‌ల నుంచి స్లిమ్మింగ్‌ సెంటర్ల వరకు.. జిమ్‌ల నుంచి వెల్‌నెస్‌ ప్యాకేజీల వరకు.. ‘బరువైన’ వారిని ఆకట్టుకునే ప్రకటనలతో సోషల్‌ మీడియాను ఊదరగొడుతున్నాయి. కనీస అర్హతలు లేని డాక్టర్లు, అనుభవం లేని జిమ్‌ మాస్టర్లు ఏవేవో యంత్రాలను చూపి, బురిడీ కొట్టిస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు. అమాయకుల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. మన దేశంలో ఏటా బరువు తగ్గించుకోవడానికి జనం చేస్తున్న ఖర్చు దాదాపు రూ.3లక్షల కోట్లు అని ఒక అంచనా.


ఆందోళనకర స్థాయిలో ఊబకాయ సమస్య

దేశవ్యాప్తంగా 2023-24లో 15-49 ఏళ్ల మహిళల్లో 30.7శాతం మంది అధికబరువు/ఊబకాయం కేటగిరీలో ఉండటం గమనార్హం. అంతకు నాలుగేళ్ల ముందటి 24 శాతంతో పోలిస్తే ఆరుశాతం ఎక్కువ. పురుషుల్లో కూడా ఈ సమస్య 22.9శాతం నుంచి 27.3శాతానికి పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 15-49 ఏళ్ల మహిళల్లో 47.9 శాతం, పురుషుల్లో 41.5 శాతం అధిక బరువు/ఊబకాయం కేటగిరీలో ఉన్నారు. తెలంగాణలో 15-49 ఏళ్ల మహిళల్లో 30.1 శాతం, పురుషుల్లో 32.3 శాతం అధిక బరువు కేటగిరీలో ఉన్నారు. పలు వేదికల ప్రకారం.. ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య లో చైనా టాప్‌లో ఉండగా, భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. దేశంలో 4.1 కోట్ల మందికిపైగా పాఠశాల వయసు పిల్లలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ తీరుతో 2040 నాటికి పిల్లల్లో జీవనశైలి వ్యాధుల ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో 74శాతం మంది పిల్లలకు రోజుకు సగటున కనీసం 60 నిమిషాలైనా శారీరక శ్రమ ఉండటం లేదు.


సోషల్‌ మీడియాతో..

‘బరువు’ మార్కెట్‌ విస్తరించడానికి సోషల్‌ మీడియా కీలక వేదికగా మారింది. ‘బిఫోర్‌-ఆఫ్టర్‌’ ఫొటోలు, వ్యక్తిగత అనుభవాల వీడియోలు, తక్కువ సమయంలో ఫలితాలంటూ ప్రచారంతో వినియోగదారులు గాలానికి చిక్కుతున్నారు. కొన్ని కేంద్రాలు డైట్‌, వ్యాయామం, కౌన్సెలింగ్‌ వంటి శాస్త్రీయ విధానాలను అనుసరిస్తే.. మరికొన్ని మాత్రం గుర్తింపు లేని విధానాలు, ప్రమాదకర పద్ధతులు, హానికర మందుల వినియోగం వంటివి అనుసరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, ఉభయ రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నల్గొండ వరకు రకరకాల పేర్లతో వెలసిన వెయిట్‌లాస్‌ క్లినిక్‌లు రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు వివిధ రకాల వెయిట్‌ లాస్‌ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి.


చైనా తయారీ వైబ్రేషన్‌ మిషన్లు, ఎలాంటి లైసెన్సులు లేని హెర్బల్‌ పౌడర్లు, రంగు నీళ్లను మ్యాజిక్‌ డ్రింక్స్‌ అంటూ అంటగడుతూ వేలకొద్దీ వసూలు చేస్తున్నాయి. అధిక బరువును తగ్గించే మందుల విభాగం ఈ మార్కెట్‌లో కొత్త శక్తిగా మారింది. గ్లూకాన్‌-లైక్‌ పెఫ్టైడ్‌ (జీఎల్‌పీ)-1 తరగతికి చెందిన మందుల వినియోగం బాగా పెరిగింది. ఫార్మారాక్‌ సంస్థ డేటా ప్రకారం.. భారత జీఎల్‌పీ-1 మందుల మార్కెట్‌ విలువ ఏడాదికి రూ.2,333 కోట్లకు చేరింది. ఇవేగాకుండా వివిధ రకాల బరువు తగ్గించే మందుల వినియోగం కూడా భారీగా ఉంది. ఇటీవల తెలంగాణలో అధికారులు మెడికల్‌ షాపులపై దాడులు చేసి వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా బరువుతగ్గే మందుల విక్రయాలు భారీగా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇష్టం వచ్చిన డోసుల్లో ఆ మందులు వాడితే కాలేయం, కిడ్నీలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల అర్హతలు, సరైన పర్యవేక్షణ, సరైన విధానాలు పాటిస్తున్నారా? అన్నది పరిశీలించి చికిత్స తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.


ఒకే ప్యాకేజీ.. అందరికీ ఎలా?

ప్రతి వ్యక్తి శారీరక, ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. వయసు, వైద్య చరిత్ర, ఇతర అంశాలను బట్టి మందుల వినియోగం ఉంటుంది. కానీ వెయిట్‌లాస్‌ క్లీనిక్‌లు అందరికీ ఒకే రకమైన వెయిట్‌లాస్‌ ప్యాకేజీలను అమలు చేస్తుండటం ఆందోళనకరం. ఇటీవల హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళా ఉద్యోగి వెయిట్‌లాస్‌ ప్యాకేజీ కోసం రూ.2.47 లక్షలు చెల్లించారు. కొన్ని సెషన్ల తర్వాత ఆమెకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. వెయిట్‌లాస్‌ క్లినిక్‌ డబ్బులు తిరిగివ్వడానికి నిరాకరించడంతో ఆమె.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. క్లినిక్‌ నిర్వాహకులది ఏకపక్ష ధోరణిగా తేల్చిన కమిషన్‌.. కట్టిన సొమ్ము తోపాటు మానసిక వేదనకు పరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది. జూబ్లీహిల్స్‌కు చెందిన శ్రావణి ప్రసవ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు.. ఓ స్లిమ్మింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించారు. 60 రోజుల్లో 15 కిలోలు బరువు తగ్గిస్తామని చెప్పి రూ.90వేలు కట్టించుకున్నారు. వారు ఇచ్చిన క్యాప్సూల్స్‌తో కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. ఆ క్యాప్సూల్స్‌లో ప్రమాదకర స్టెరాయిడ్స్‌ ఉన్నాయని వెల్లడైంది.


కుటుంబం నుంచే మార్పురావాలి

బాల్యంలోనే ఊబకాయం కేవలం బరువుకు సంబంధించిన సమస్య కాదు. భవిష్యత్తులో అధిక రక్తపోటు, ఇన్సులిన్‌ నిరోధకత, టైప్‌-2 మధుమేహం, ఫ్యాటీలివర్‌ వంటి అనేక సమస్యలకు అది దారితీస్తుంది. కఠినమైన డైటింగ్‌ చేయించడం కంటే కుటుంబం మొత్తం ఆరోగ్యకర ఆహార అలవాట్లు పాటించడం ముఖ్యం. జంక్‌ఫుడ్‌, చక్కెర పానీయాలను తగ్గించి.. ఇంటి ఆహారం, క్రమబద్ధమైన నిద్ర, ఆటలు, శారీరక శ్రమకు ప్రాధాన్యమివ్వాలి. తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వం సమష్టిగా చర్యలు తీసుకున్నప్పుడే పిల్లల్లో ఊబకాయం సమస్యను నియంత్రించగలం. బరువు తగ్గిస్తామంటూ పుట్టుకొచ్చిన సెంటర్లను నమ్మలేం.

- డాక్టర్‌ కిరణ్మయి,

సీనియర్‌ న్యూట్రిషనిస్ట్‌,

రెయిన్‌బో ఆస్పత్రి, హైదరాబాద్‌


త్వరగా బరువు తగ్గడం ప్రమాదకరం

బరువు తగ్గడం రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదు. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్‌ మందులు శరీరంలోని కొవ్వును కాదు.. మెటబాలిజంను శాశ్వతంగా దెబ్బతీస్తాయి. అలా ప్రాణాల మీదకు తెచ్చుకునే కంటే.. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఉత్తమం. వ్యాయామం, ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల నెలకు 3-4 కిలోల వరకు బరువు తగ్గడం శ్రేయస్కరం. మందులు, ఇతర యంత్రపరికరాలను వినియోగించడం ద్వారా నెలలో 10 కిలోలు తగ్గితే.. మళ్లీ వెంటనే బరువు పెరుగుతారు. అది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

- డాక్టర్‌ పి.కల్యాణి,

న్యూట్రిషనిస్ట్‌,

రివర్‌ నిమ్స్‌ హాస్పిటల్‌, నల్లగొండ


ఈ వార్తలు కూడా చదవండి:

జన్వాడ ఫాంహౌస్‌.. అక్రమ నిర్మాణం
సిలిండర్‌ ప్లీజ్‌..!!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 05:07 AM