Share News

సిలిండర్‌ ప్లీజ్‌..!!

ABN , Publish Date - Sep 20 , 2026 | 04:57 AM

స్వామి, భవ్య కొత్త దంపతులు.. పెళ్లయి నాలుగు నెలలైంది. ఉద్యోగులైన వీరిద్దరూ హైదరాబాద్‌లో కొత్తగా కాపురం పెట్టారు. ఇంట్లో అన్ని వసతులున్నా వంట చేసుకునేందుకు గ్యాస్‌ సిలిండర్‌ లేదు.

సిలిండర్‌ ప్లీజ్‌..!!
LPG shortage

  • ఆరు నెలలుగా కొత్త గ్యాస్‌ కనెక్షన్లు బంద్‌

  • యుద్ధం నేపథ్యంలో నిలిపేసిన కేంద్రం

  • గృహ వినియోగ కనెక్షన్ల కోసం ఏజెన్సీల చుట్టూ వినియోగదారుల ప్రదక్షిణలు

  • ఇతరుల వద్ద అధిక ధరకు కొనుగోలు

జనగామ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): స్వామి, భవ్య కొత్త దంపతులు.. పెళ్లయి నాలుగు నెలలైంది. ఉద్యోగులైన వీరిద్దరూ హైదరాబాద్‌లో కొత్తగా కాపురం పెట్టారు. ఇంట్లో అన్ని వసతులున్నా వంట చేసుకునేందుకు గ్యాస్‌ సిలిండర్‌ లేదు. సరే కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకుందామంటే గ్యాస్‌ ఏజెన్సీలు కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా తెలిసిన వారి దగ్గరి నుంచి అధిక మొత్తానికి సిలిండర్‌ తెచ్చుకొని పొదుపుగా వాడుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా గ్యాస్‌ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ జంట మాత్రమే కాదు.. వారిలా కొత్త కాపురం పెట్టిన అనేక కొత్త జంటలు, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం సొంతూళ్ల నుంచి నగరానికి, పట్టణాలకు కొత్తగా వలస వచ్చిన చాలామంది గ్యాస్‌ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీలు ఆరు నెలలుగా కొత్త గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం.


పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో నిలిచిపోయిన కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ల జారీ ప్రక్రియను ఆరు నెలలైనా ఇంకా పునరుద్ధరించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి 30 లక్షలకు పైగా గృహ వినియోగ గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా నెలకు సగటును 58 లక్షల పైన బుకింగ్స్‌ జరుగుతున్నాయి. అయితే, అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత దేశంలో గ్యాస్‌ నిల్వలు, ఇంధన నిల్వలు తగ్గిపోయాయి. దీంతో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే కమర్షియల్‌ సిలిండర్ల జారీని కూడా కట్టడి చేసింది. అలాగే, ఇప్పటికే కనెక్షన్‌ కలిగిన గృహ వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు గాను మార్చి నెలలో కొత్త కనెక్షన్ల జారీని ఆపేసింది.


ఈ నిర్ణయం తీసుకొని ఆరు నెలలు దాటుతున్నా కొత్త కనెక్షన్ల జారీ పునరుద్ధరణపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు కొత్త కనెక్షన్‌ జారీ చేయలేమని ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన చాలామంది ఉపాధి నిమిత్తం పట్టణ, నగర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. వీరితోపాటు పెళ్లి అయి వేరు కాపురం పెట్టిన కుటుంబాలు కూడా కొత్త గ్యాస్‌ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. తక్కు వ మంది ఉన్న కుటుంబాలకు సిలిండర్ల అవసరం తక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది అలాంటి వారిని గుర్తించి వారి పేరు మీద గ్యాస్‌ బుకింగ్‌ చేసుకొని వచ్చిన సిలిండర్‌ వాడుకుంటున్నారు. ఇందుకు గాను కనెక్షన్‌ దారుడికి సిలిండర్‌ ధరకు అదనంగా రూ.200 దాకా ఇస్తున్నారు.


అప్లికేషన్‌లు బంద్‌

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఆ అప్లికేషన్‌ సైట్‌ను 6నెలలుగా ఆపేశాయి. అలాగే, కొత్త దరఖాస్తులతోపాటు డబుల్‌ సిలిండర్ల జారీపైనా ఆంక్షలు అమలు చేస్తున్నట్టు సమాచారం. డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్‌ఉన్న పలువురు అవసరానికి మించి సిలిండర్‌ బుక్‌ చేసుకొని వాణిజ్య అవసరాలకు ఇస్తున్నట్లు తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఎర్రవల్లి రైతులకు నోటీసులు
‘బరువు’ దోపిడీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 04:57 AM