ఎర్రవల్లి రైతులకు నోటీసులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:22 AM
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లోని 388.05 ఎకరాల భూమికి సంబంధించి రికార్డుల్లో నమోదైన రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
సర్వే నం.325లో భూమి ఉన్న రైతులు ఆధారాలతో రావాలని ఆదేశం..
రేపటి నుంచి రైతుల వారీగా సర్వే
మూడో రోజూ సర్వే.. మ్యాప్ తయారీ
ఎర్రవల్లిలో తమ భూములున్నాయంటూ వెంకటాపూర్ రైతుల రాక
భూముల సర్వే నంబర్లను మార్చారు
సీఎం రేవంత్ ప్రకటనతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది: రైతులు
అధికారులకు ఆధారాల అందజేత
గజ్వేల్/మర్కుక్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లోని 388.05 ఎకరాల భూమికి సంబంధించి రికార్డుల్లో నమోదైన రైతులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మర్కుక్ తహసీల్దార్ సరిత శనివారం 100 మంది రైతులకు ఈ నోటీసులిచ్చారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు వీటిని అందజేశారు. నోటీసు అందనివారు ఎవరైనా ఉంటే.. వారి ఇంట్లో అందజేస్తామని, లేదంటే గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో పెడతామని చెప్పారు. ఈ నెల 21 నుంచి రైతుల వారీగా సర్వే చేపడతామన్నారు. సర్వేకు ప్రతి రైతు తప్పనిసరిగా హాజరై.. తమకు ఆ భూమి ఎలా వచ్చిందన్న విషయాన్ని ఆధారాలతో వివరించాలని, భూమి హద్దులను సర్వే అధికారులకు తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు శనివారం మూడో రోజూ ఎర్రవల్లిలో అధికారులు సర్వే కొనసాగించారు. సర్వే నంబర్ 325లోని 388.05 ఎకరాల భూమికి శాటిలైట్ (డీజీపీఎస్) ద్వారా బౌండరీ సర్వేను శుక్రవారమే పూర్తిచేయగా.. అక్కడక్కడా మిగిలిపోయిన భూమికి శనివారం ఉదయం 8 గంటల నుంచి కోఆర్డినేట్స్ సేకరించి పూర్తి చేశారు. ఇప్పటికే ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన మ్యాప్‌ను జిల్లా సర్వే శాఖ ఏడీ సుదర్శన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లో రూపొందిస్తున్నారు. ఈ బౌండరీ మ్యాప్‌ను పాత మ్యాప్‌తో అన్వయించిన అనంతరం రైతుల వారీగా సర్వే చేపట్టనున్నారు. గతంలో రైతులకు భూమి ఎలా సంక్రమించిందన్న ఆధారాలతో ప్రస్తుతం వారికి ఉన్న భూమిని సరిపోల్చనున్నారు. ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి చేసిన అనంతరం రైతువారీగా సబ్‌డివిజన్ చేయనున్నారు.
ఎర్రవల్లిలో మా భూములూ ఉన్నాయి..
ఎర్రవల్లి భూముల వ్యవహారంలో శనివారం కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో తమ భూములు కూడా ఉన్నాయంటూ శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో తమ భూముల శివారును మార్చి ఎర్రవల్లి సర్వే నంబర్‌లో కలిపారని ఆరోపించారు. ఈ మేరకు మర్కుక్ మండల తహసీల్దార్ సరితను కలిసి తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించారు. శివారు వెంకటాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 41లో 27.23 ఎకరాలు, సర్వే నంబర్ 85లో 73.12 ఎకరాలు, 88 సర్వే నంబర్ లో 6.28 ఎకరాలు, 89 సర్వే నంబర్‌లో 9ఎకరాలు, 100 సర్వే నంబర్‌లో 2ఎకరాలు, 101, 162 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉందని తెలిపారు.
తమ గ్రామంలోని ఈ మొత్తం భూమిని కొల్లగొట్టి సరిహద్దులను మార్చారని ఆరోపించారు. తాతల నాటి నుంచి ఉన్న నక్షలను, సర్వేనెంబర్లను కూడా మార్చారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వచ్చిందన్నారు. కాగా, వీరు అందజేసిన ఆధారాలను అధికారులు పరిశీలించారు. ఈ నెల 21 నుంచి రైతులవారీగా చేపట్టనున్న సర్వేకు హాజరు కావాల్సిందిగా శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులకు కూడా నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News