జన్వాడ ఫాంహౌస్.. అక్రమ నిర్మాణం
ABN , Publish Date - Sep 20 , 2026 | 04:10 AM
జన్వాడ ఫాంహౌస్ నిర్మాణం, భూమి యాజమాన్యం, లీజు ఒప్పందంపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. ఫిర్యాదుపై అధికారులు రికార్డులు, నిర్మాణ అనుమతులను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
అనుమతులు లేకుండా నాలాపై నిర్మించారు
విచారణ జరిపి చర్యలు తీసుకోండి
హైడ్రా కమిషనర్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
జన్వాడకు వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం
కేటీఆర్ లీజు ఒప్పందంపై అనుమానాలు
అసలు యజమానెవరో తేల్చాలి: కాంగ్రెస్ నేతలు
ఫాంహౌస్ నిర్మాణానికి అనుమతుల్లేవ్..
అసెస్‌మెంట్ నంబరే ఉంది: హైడ్రా కమిషనర్
ఫాంహౌస్ వద్దకు భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు
ఇరు పార్టీల నాయకుల రాకతో ఉద్రిక్తం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/శంకరపల్లి/చేవెళ్ల): జన్వాడలోని ఫాంహౌస్ ముమ్మాటికీ అక్రమ నిర్మాణమని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల బృందం ఆరోపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా నాలాపై దీనిని నిర్మించారని తెలిపింది. ఈ నిర్మాణాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. శనివారం జన్వాడ ఫాంహౌ్‌సను పరిశీలించేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫాంహౌస్ తనదేనని, ఇక్కడికి వస్తే కేసులు పెడతానని అంటున్న ప్రదీ్‌పరెడ్డి ఇన్ని ఎకరాల్లో ఫాంహౌస్ ఎలా కట్టారని ప్రశ్నించారు. ప్రైవేటు భూముల్లోకి రావాలనే ఉద్దేశం తమకు లేదని, అయితే కేసీఆర్ కుటుంబం అధికార దుర్వినియోగానికి పాల్పడిన తీరును ప్రజలకు చూపించేందుకే వచ్చామని అన్నారు.
సూర్యాపేటలో కమ్యూనిస్టు మాజీ ఎమ్మెల్యే కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుందని, కేసీఆర్ కుటుంబం మాత్రం భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ప్రదీ్‌పరెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని డ్రోన్ ఎగురవేసినందుకు కేసు పెట్టి టెర్రరిస్టులా జైలుకు పంపారని తెలిపారు. అప్పుడు ఈ ఫాంహౌ్‌సలో నాటి మంత్రి కేటీఆర్ ఉంటున్నారని ప్రదీ్‌పరెడ్డే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అంతేకాకుండా.. జన్వాడ భూములు సత్యం రామలింగరాజు బినామీ కంపెనీ శతభిష ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుమీద ఉన్నాయని చెప్పారు. అయితే సత్యం కుంభకోణం బయటపడిన తర్వాత..సత్యం ఆస్తులతోపాటు శతభిష కంపెనీ ఆస్తులు, ఆ కంపెనీకి చెందిన 6లక్షల షేర్లపై ఈడీ, ఐటీ శాఖలు నిషేధం విధించాయని పేర్కొన్నారు. కానీ, ఐటీ ట్రైబ్యునల్‌లో కేసులుండగానే భూములను బదలాయించారన్నారని ఆరోపించారు.
ఈడీ, ఐటీ కేసుల్లో ఉన్న భూమి ఎలా రిలీజైంది?
జన్వాడలోని సర్వే నంబర్లు 301, 311, 313లోని భూములను కేటీఆర్ బాల్యమిత్రుడికి చెందిన డీఎన్‌బీ కంపెనీకి బదిలీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. డి.రాజేశ్ అనే వ్యక్తి సత్యం రామలింగరాజు కుమారుడికి సన్నిహితుడని, అతని పేరిట ఉన్న కంపెనీకి బదిలీ చేశారని అన్నారు. ఈడీ, ఐటీ కేసుల్లో ఉన్న 13 ఎకరాలను ఎలా? ఎందుకు? రిలీజ్ చేశారనేది బయటపడాలన్నారు. ప్రదీ్‌పరెడ్డికి ఈ భూమి ఎలా బదిలీ అయిందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ చెప్పాలన్నారు. భూమి బదిలీపై ఈడీ, ఐటీ శాఖలు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని పశ్నించారు.
ఇది ముమ్మాటికీ కేటీఆర్‌కు చెందిన ఫాంహౌసేనని, ప్రదీ్‌పరెడ్డి కేటీఆర్ బినామీ అని అన్నారు. ఐటీ, ట్రైబ్యునల్ కోర్టులో ఉన్న 13 ఎకరాల భూముల బదిలీ ఎలా జరిగిందన్నారు. ఇందులో ప్రదీ్‌పరెడ్డి పేరిట 4 ఎకరాలు ఉండగా, కేటీఆర్ భార్య శైలిమ పేరిట 3.02 ఎకరాలు, కేటీఆర్ అత్త శశిరేఖ పేరిట 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. లీజ్ అగ్రిమెంట్ ఉంటే ఆ పత్రాలను ఎందుకు చూపడం లేదని నిలదీశారు. జీవో 111 పరిధిలో ఫిరంగి నాలాను ఆక్రమించి భారీ కాంక్రీట్ భవనాన్ని అక్రమంగా నిర్మించారని అన్నారు. నాడు ముున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్..అక్రమంగా నిర్మించినఫాంహౌ్‌సలో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జన్వాడ ఫాంహౌస్ ఎవరి పేరిట ఉందో స్పష్టత లేదని, దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని ఎంపీ మల్లు రవి అన్నారు. ఇక్కడ ఉన్న భూముల రికార్డులు, యాజమాన్య వివరాలు, భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడమే తమ పర్యటన ఉద్దేశమని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్‌కు ఫోన్..
జన్వాడ ఫాంహౌ్‌సను కేటీఆర్ లీజుకు తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆ లీజు ఒప్పందంపై అనుమానాలు ఉన్నాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. దీనిపై వాస్తవాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు జన్వాడ నుంచే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు, మున్సిపల్ కమిషనర్‌కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ‘‘జన్వాడ ఫాంహౌ్‌సకు సంబంధించి నోటీసులు ఇచ్చారు కదా? ఆ నోటీసులకు సమాధానం వచ్చిందా? తరువాత ఏం చర్యలు తీసుకున్నారు?’’అని చామల ప్రశ్నించారు.
ఈ మేరకు రంగనాథ్ సమాధానమిస్తూ.. జన్వాడలోని సర్వే నంబర్ 311/7లో ఉన్న భవనం, ఫాంహౌస్ వివాదానికి సంబంధించి ఈ ఏడాది జూలై 15న ప్రదీ్‌పరెడ్డి అనే వ్యక్తికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే ప్రదీ్‌పరెడ్డి నాలుగు వారాల గడువు కోరారని, కానీ..ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని చెప్పారు. గూగుల్ మ్యాప్‌లు, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లను పరిశీలిస్తే.. ఫాంహౌస్ కింద నుంచి ఫిరంగి నాలా వెళ్తున్నట్లు తేలిందని వెల్లడించారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో కలిసి జాయింట్ సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, అవినీతి సొమ్ముతో కేటీఆరే జన్వాడ ఫాంహౌ్‌సను నిర్మించుకున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఈ భూముల్లో రూ.300 కోట్ల స్కామ్ జరిగిందని, అన్ని విషయాలూ త్వరలోనే బయటికి వస్తాయన్నారు.
ఫాంహౌస్ వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్ నేతల రాకతో జన్వాడ ఫాంహౌస్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు జన్వాడ ఫాంహౌస్ వద్దకు వస్తున్నట్లు తెలిసి స్థానిక బీఆర్‌ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతల బృందాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. కాగా, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రదీ్‌పరెడ్డి ఫాంహౌస్ వద్దకు దౌర్జన్యానికి వచ్చారని ఆయన అడ్వకేట్ రాజేశ్వరరావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నిజాం నిరంకుశత్వం తలవంచిన రోజు
ఖైరతాబాద్ గణేశుడికి ఉన్నంత పేరు నాకొచ్చింది
Read Latest AP News And Telangana News And International News And Telugu News