కామారెడ్డి వెళ్లి తీరుతాం: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ABN , Publish Date - Feb 22 , 2026 | 09:20 AM
కామారెడ్డి, బాన్సువాడకు వెళ్లేందుకు సిద్దమైన టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావును పోలీసులు అడ్డుకున్నారు. తార్నాకలోని నివాసంలో ఆయన్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో రాంచందర్ రావు మాట్లాడారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 22: బాన్సువాడ, కామారెడ్డి అంశంలో తమ ఎమ్మెల్యే తప్పుంటే నిరూపించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సవాల్ విసిరారు. ఈ అంశంలో తప్పుంటే తమ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హౌస్ అరెస్ట్ నేపథ్యంలో ఆదివారం తార్నాకలోని తన నివాసంలో టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ అంశంపై హై కమాండ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. అధికారంలో ఉన్నామని ఇష్టారీతిగా వ్యవహరిస్తే తమకూ అవకాశం వస్తుందని హెచ్చరించారు. శిశుమందిర్ భూ వ్యవహారంలో తమ పార్టీ ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నారు.
వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారని చెప్పారు రాంచందర్ రావు. ఆ క్రమంలోనే వారిని అడ్డుకునే ప్రయతాన్ని తమ పార్టీ శ్రేణులు చేశాయని వివరించారు. స్థానిక ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై దాడికి యత్నించారని ఆరోపించారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. తన హౌస్ అరెస్ట్ గురించి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లతో మాట్లాడినట్లు తెలిపారు. కామారెడ్డికి వెళ్లేందుకు తమకు అనుమతి లేదంటూ వ్యాఖ్యలు చేస్తున్న పోలీసులు.. అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి వెళ్లి తీరుతామని టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కుండబద్దలు కొట్టారు.
రాంచందర్ రావు హౌస్ అరెస్ట్‌పై కేంద్రమంత్రి రియాక్షన్..
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హౌస్ అరెస్టుపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేయడమేంటి? అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
ఈ అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధం కావాలంటూ బీజేపీ శ్రేణులకు ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోవాలని కేడర్‌కు సూచించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గమని అభివర్ణించారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి చేయడం అమానుషమన్నారు.
కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీనేనని కేంద్రమంత్రి విమర్శించారు. ఆత్మరక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటని పేర్కొన్నారు. బాన్సువాడలో 70మందిని అరెస్ట్ చేయడం అక్రమమని తెలిపారు. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్య లేవి? అంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. ఎంఐఎంను కాపాడేందుకు ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For TG News And Telugu News