బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Mar 14 , 2026 | 05:40 PM
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, మార్చి14: గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన సమస్యలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో కొంత ఇబ్బంది ఉన్నట్లు వెల్లడించారు.
ఇవాళ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్(LPG) సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 811 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.3 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 11 లక్షలు ఉజ్వల పథకం, 28 లక్షలు దీపం పథకం కింద ఉన్నాయని వెల్లడించారు. అదనంగా 7.5 లక్షల కమర్షియల్ కనెక్షన్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.
ప్రతి నెల రాష్ట్రంలో 58 లక్షల నుంచి 60 లక్షల వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయని మంత్రి వివరించారు. ఇటీవల కొన్ని రోజులుగా ప్రజల్లో ఆందోళన కారణంగా బుకింగ్స్ రెట్టింపు అవుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ గృహ వినియోగ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. ప్రతిరోజూ సుమారు 2.5 లక్షల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయని తెలిపారు. గత రెండు రోజులుగా కూడా ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసినట్లు మంత్రి చెప్పారు.
అయితే కమర్షియల్ సిలిండర్ల విషయంలో కొంత కొరత ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రోజుకు సుమారు 23 వేల కమర్షియల్ సిలిండర్లు అవసరం ఉండగా ప్రస్తుతం 6,200 మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20 శాతం పరిమితిలోనే జరుగుతోందని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సివిల్ సప్లయ్ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా సంబంధిత ఫిర్యాదుల కోసం 180042500333 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే