Share News

గ్రామ పంచాయతీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన..

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:13 PM

తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయన్నారు.

గ్రామ పంచాయతీ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన..
Union Minister Kishan Reddy

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 2025-26 సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత నిధులు విడుదలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ.619.85 కోట్లు విడుదల చేయడాన్ని స్వాగతించారు కేంద్ర మంత్రి. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ మంత్రాన్ని అక్షరాలా ఆచరణలో పెడుతూ ప్రతి గ్రామం సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు.


కేంద్రం విడుదల చేసిన రూ.619.85 కోట్ల నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయన్నారు. టైడ్ గ్రాంట్ నిధులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీరు సంరక్షణ, ప్రజల జీవన ప్రమాణాల పెంపు వంటి అనేక పనులు చేయవచ్చన్నారు. అన్ టైడ్ గ్రాంట్ నిధులను మాత్రం స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభల్లో నిర్ణయం తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.


కేంద్ర మంత్రి ప్రకటన ఇదే..

'15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం.. గ్రామీణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధులు కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన వెంటనే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖలు 10 పని దినాలలోపు సంబంధిత గ్రామ పంచాయతీలకు నిధులను వెంటనే బదిలీ చేయాల్సి ఉంటుంది. అంతకుమించి ఆలస్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పథకాల కోసం తీసుకున్న మార్కెట్ రుణాలు/రాష్ట్ర అభివృద్ధి రుణాల(SDL)పై చెల్లిస్తున్న వడ్డీ రేటు ప్రకారం గ్రామ పంచాయతీలకు వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం విడుదల చేసిన నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. 2015-16 నుంచి 2019-20 వరకు 14వ ఆర్థిక సంఘం కింద రూ.5,060 కోట్లు విడుదల చేయగా.. 2020-21 నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం కింద కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకున్నాయి. దీంతో 14, 15వ ఆర్థిక సంఘాల కాలంలో కేంద్రం మొత్తం రూ.14,110 కోట్లు తెలంగాణకు కేటాయించింది. వీటిలో 2026 జనవరికి ముందే రూ.11,111 కోట్లు రాష్ట్రానికి కేంద్రం విడుదల చేసింది. 2024-25కు సంబంధించి 2026 జనవరి నుంచి ఇప్పటివరకు రూ.1,032.42 కోట్లను విడుదల చేసింది. తాజాగా 2025-26కు సంబంధించి రూ.619.85 కోట్లను మొదటి విడత కింద విడుదల చేసింది. ఇక, 16 ఆర్థిక సంఘం కింద 2026-27 నుంచి 2030-31 మధ్య కాలంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలు రూ.9,968 కోట్లను గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి పొందనున్నాయి.


తెలంగాణ ప్రభుత్వం సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా.. రెండేళ్ల పాటు (2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన) నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రం వాటిని విడుదల చేసింది. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులనూ కేంద్రం విడుదల చేసింది. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించాయి. అయినప్పటికీ.. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించగానే నిధులను విడుదల చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను రేండెళ్లపాటు నిర్వహించకుండా స్పెషల్ ఆఫీసర్ల పాలనతో రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొచ్చింది. ఇకపైనా ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తే తదనుగుణంగా నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అంటూ ప్రకటన జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

కనిపెట్టకుండా కనికట్టు

Updated Date - Apr 02 , 2026 | 04:19 PM