Share News

డిగ్రీ, పీజీలు చదివినా యాచకవృత్తిలోకి వెళ్లాల్సిందేనా?

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:46 AM

‘‘డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదు. పీహెచ్‌డీ పూర్తిచేసినా ఉపాధి దొరకడం లేదు. చివరకు బతుకుదెరువు కోసం యాచకవృత్తిలోకి వెళ్లాల్సిందేనా?’’అంటూ ట్రాన్స్‌జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

డిగ్రీ, పీజీలు చదివినా యాచకవృత్తిలోకి వెళ్లాల్సిందేనా?
Transgender Rights India

  • జస్టిస్‌ ఆశామీనన్‌ కమిటీ ముందు ట్రాన్స్‌జెండర్ల ఆవేదన

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదు. పీహెచ్‌డీ పూర్తిచేసినా ఉపాధి దొరకడం లేదు. చివరకు బతుకుదెరువు కోసం యాచకవృత్తిలోకి వెళ్లాల్సిందేనా?’’అంటూ ట్రాన్స్‌జెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉద్యోగాల్లో తమకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ ఆశా మీనన్‌ కమిటీకి వారు విజ్ఞప్తి చేశారు. మంగళవారం బేగంపేటలోని హోటల్‌ ప్లాజాలో దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌జెండర్లపై సమీక్షా సమావేశం రెండో రోజూ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడుకు చెందిన ట్రాన్స్‌జెండర్లు హాజరై.. తమ సమస్యలను వివరించారు. పుదుచ్చేరిలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు లేదని ఉద్యమకారిణి శీతల్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.


ఎమ్మెస్సీ రేడియాలజీ, మెరైన్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ వంటి అర్హతలున్నా పైవ్రేటు సంస్థలు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు చదువుకోవాలని ఉందని, అందుకు అవకాశం కల్పించాలని పలువురు కోరారు. యూజీసీ ప్రవేశపరీక్ష దరఖాస్తుల్లో ట్రాన్స్‌జెండర్‌ కేటగిరీ ఉన్నా.. కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపులో అమలు కావడం లేదని ట్రాన్స్‌జెండర్లు కమిటీకి ఫిర్యాదు చేశారు. తమిళనాడులో ఉన్నత విద్యనభ్యసించే ట్రాన్స్‌జెండర్లకు ఉపకారవేతనాలు అందిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈ విధానం అమలయ్యేలా చూడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్‌ ధ్రువీకరణ పత్రం కోసం ఆస్పత్రులకు వెళ్లినప్పుడు భౌతిక పరిశీలన చేస్తున్నారని ఒక ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేయగా, జస్టిస్‌ ఆశా మీనన్‌ విచారణకు ఆదేశించారు. ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.4వేల చొప్పున పింఛను ఇస్తున్నా.. కొద్దిమందికే అందుతోందని బోను దుర్గ తెలిపారు. ‘‘అన్నామలై వర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తిచేసినా.. ఉద్యోగ ప్రయత్నానికి వెళ్లిన ప్రతిచోటా ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంత చదివీ యాచకవృత్తి లేదా సెక్స్‌ వర్క్‌లోకి తిరిగి వెళ్లాల్సిందేనా’’అని రక్షిత అనే ట్రాన్స్‌ జెండర్‌ వాపోయారు.


ఇవి కూడా చదవండి...

కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 04:46 AM