వారందరూ దేశానికి గట్టి పునాదులు వేశారు: టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:49 AM
గాంధీభవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు.
హైదరాబాద్, జనవరి 26: స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనని పెద్దలు 2014 నుంచి అధికారంలోకి వచ్చారని, వారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) విమర్శించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ పేరును తొలగించాలని మన్రేగా పథకాన్ని రద్దు చేస్తున్నారని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రాలు కనిపిస్తాయని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని, లౌకికవాదానికి తూట్లు పొడుస్తున్నారని, కులాలు- మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మహేష్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో ఆర్థిక విధ్వంసం జరిగిందని... సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కుల సర్వేతో యావత్ రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని, బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ కోరారు. మహాత్ముడి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య పోరాటం విజయవంతమైందని, ప్రపంచం గర్వించదగ్గ రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రాశారన్నారు. మహాత్మా గాంధీ కలలు నెరవేర్చే దూరదృష్టి ఉన్న వ్యక్తి నెహ్రూ అని ప్రశంసించారు. ఐరన్ లేడీ ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి గట్టి పునాదులు వేశారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డాక్టర్ అజారుద్దీన్, షబ్బీర్ అలీ సహా వీహెచ్, దానం నాగేందర్, సంపత్, కోదండరాం, బెల్లయ్య నాయక్, చిన్నారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్
Read Latest Telangana News And Telugu News