Share News

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్

ABN , Publish Date - Jan 26 , 2026 | 10:31 AM

77వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ప్రజలనుద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌.. హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచేలా తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్: గవర్నర్
Telangana Governor Jishnu Dev Varma

హైదరాబాద్, జనవరి 26: భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor jishnu dev varma) అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఎగరవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని.. ఈ డాక్యుమెంట్ హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించి, కీలక రంగాలకు ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.


ధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానం..

మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయించినట్లు గవర్నర్ వెల్లడించారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాయని ఆయన పేర్కొన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు, ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందజేశామని గవర్నర్ తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని గర్వంగా చెప్పారు.


ఉద్యోగాల భర్తీ..

భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గ్రూప్-1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు. ITIలను అడ్వాన్స్‌ టెక్నికల్ సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు.


మహిళలకు ప్రాధాన్యం...

మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని గవర్నర్ తెలిపారు. బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.40 వేల కోట్లు సమకూర్చామని, మహిళలను పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులకు ఓనర్లుగా చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం.. 27 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టిందని గవర్నర్ తెలిపారు.


హిల్ట్ పాలసీతో...

తెలంగాణలో 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, రాష్ట్రంలో 3.35 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామని జిష్ణుదేవ్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, హిల్ట్ పాలసీతో కాలుష్య పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తామని గవర్నర్ వెల్లడించారు.


అంతకుముందు, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు హాజరయ్యారు.

అమెరికా పర్యటనలో ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే పరేడ్‌కు హాజరుకాలేదు. సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సందేశమిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ఆమోదించబడిన ఈ రోజును భారతదేశ చరిత్రలో ముఖ్యమైన సందర్భంగా సీఎం అభివర్ణించారు.


ఇవి కూడా చదవండి...

77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్

ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 26 , 2026 | 12:25 PM