బీజేపీ ఆఫీస్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కాంగ్రెస్‌పై రామచందర్ రావు విమర్శలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 10:08 AM
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day) ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు చేశారని... నెహ్రూ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారని విమర్శించారు. మొదటిసారి రాజ్యాంగాన్ని అవమానించింది నెహ్రూ అని... అంబేడ్కర్‌ను అవమానించారని ఆరోపించారు. అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ విరుచుకుపడ్డారు.
రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కాలరాశారని.. ఇందిరా, రాజీవ్ గాంధీల బాటలోనే రాహుల్ గాంధీ నడుస్తున్నారని విమర్శించారు. భారతీయులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని... ఇతర దేశాలకు చెందిన వారికి ఓటు హక్కు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. సీఐఆర్(SIR)పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి పథకంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పేదలకు మేలు చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలంగాణ బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 60 ఏళ్లపాటు దేశాన్ని దోచుకుందని.. పేదలకు మేలు చేసే పథకాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ విమర్శించారు. రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. అంబేడ్కర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం భారతరత్న ఇవ్వలేదని గుర్తుచేశారు. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని గౌరవించింది మోదీ ప్రభుత్వమని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రైతులకు ఏమీ చేయలేదని, ప్రధాని కిసాన్ యోజన ద్వారా రైతులకు మోదీ మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. మజ్లిస్‌తో కలిసి కాంగ్రెస్ పని చేస్తోందని... కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అవినీతి పార్టీలంటూ వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీలను తరిమికొట్టి బీజేపీని ఆదరించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్
ఏపీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
Read Latest Telangana News And Telugu News