Share News

భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?

ABN , Publish Date - Jan 26 , 2026 | 07:59 AM

ఐరోపా నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారత్ ప్రస్తుతమున్న 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించే యోచనలో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

భారత్ కీలక నిర్ణయం.. ఐరోపా కార్లపై భారీగా తగ్గనున్న సుంకాలు?
India EU free trade agreement, Import Duty Cut

ఇంటర్నెట్ డెస్క్: ఐరోపా సమాఖ్యతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. మంగళవారం ఇరు దేశాలు ఈ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలను భారత్ సగానికి పైగా తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతమున్న 110 శాతం సుంకాన్ని 40 శాతానికి తగ్గించే ఛాన్సు ఉందని సమాచారం. భవిష్యత్తులో దీన్ని ఏకంగా 10 శాతానికే పరిమితం చేసేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (Import tariff Cut on Cars from EU Nations).

ఒప్పందం కుదిరిన వెంటనే కొత్త సుంకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 27 సభ్యదేశాలున్న ఈయూ నుంచి దిగుమతి చేసుకునే రూ.16. లక్షల పైచిలుకు ధరల కార్లపై 40 శాతం సుంకం విధిస్తారట. భవిష్యత్తులో ఈ సుంకాన్ని 10 శాతానికి కూడా తగ్గించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అనూహ్య భౌగోళిక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత కార్ల మార్కెట్‌లో ప్రవేశానికి సుంకాల అడ్డంకులను తొలగించాలని ఎంతోకాలంగా ఈయూ అభ్యర్థిస్తున్న విషయం తెలిసిందే.


కొత్త సుంకాలు అమల్లోకి వస్తే ఫోక్స్‌వాగన్, మెర్సిడీజ్ బెన్జ్, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఐరోపా బ్రాండ్ కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. దేశీ సంస్థలకు ఐరోపా కంపెనీల నుంచి పోటీ మరింత పెరుగుతుంది. దిగుమతి సుంకాలు ఈ స్థాయిలో తగ్గితే భారత ఆటోమొబైల్ రంగంపై దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ వార్తలపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఐరోపా కమిషన్ ఇంకా స్పందించాల్సి ఉంది.

నేడు జరగనున్న గణతంత్ర దినోత్సవంలో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇక మంగళవారం, ఇరువురు నేతలు ప్రధాని మోదీతో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.


ఇవీ చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..

రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు

Updated Date - Jan 26 , 2026 | 08:12 AM