తుమ్మిడిహెట్టి ఎత్తుపై నిర్ణయం.. ముంపుపై స్వతంత్ర అధ్యయనం తర్వాతే!
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:08 AM
తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే చోటుచేసుకునే ముంపుపై స్వతంత్ర అధ్యయనం తర్వాతే.. ఎత్తుపై తదుపరి నిర్ణయం ఉంటుందని మహారాష్ట్ర పేర్కొంది.
అధ్యయనానికి ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే చోటుచేసుకునే ముంపుపై స్వతంత్ర అధ్యయనం తర్వాతే.. ఎత్తుపై తదుపరి నిర్ణయం ఉంటుందని మహారాష్ట్ర పేర్కొంది. ఈ అధ్యయనం కోసం త్వరలో రెండు రాష్ట్రాల అధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ కమిటీలో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలతోపాటు నాగ్‌పూర్ చీఫ్ ఇంజనీర్, జాయింట్ కలెక్టర్, మంచిర్యాల చీఫ్ ఇంజనీర్, అదనపు కలెక్టర్ ఉండనున్నట్లు పేర్కొంది. ఈ కమిటీ.. బ్యారేజీ ఎత్తు పెంపునకు సంబంధించిన సాంకేతిక, న్యాయపరమైన అంశాలను పరిశీలించి, రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకరించిన గడువులో నివేదిక సమర్పించాల్సి ఉంటుందని వివరించింది.
నివేదిక అందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు అక్టోబరు 26న జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశపు మినిట్స్‌ను తాజాగా విడుదల చేసింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 148 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి 2016 ఆగస్టు 23న మహారాష్ట్ర సమ్మతి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎత్తుతో నిర్ణీత లక్ష్యం మేరకు నీటిని తరలించలేమని, మళ్లీ పంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు నివేదించారు. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి సమ్మతి తెలపాలని కోరారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws