దురుద్దేశంతోనే దిగుమతి సుంకం తగ్గింపు
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:11 AM
కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఎన్నికలు వచ్చే ప్రతీసారి దిగుమతి సుంకం తగ్గిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అంబానీ, అదానీలను కాకుండా రైతులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు.
రాజకీయ కారణాలతో సుంకం తగ్గించడం సరికాదు: తుమ్మల
నంగునూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా ఎన్నికలు వచ్చే ప్రతీసారి దిగుమతి సుంకం తగ్గిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. అంబానీ, అదానీలను కాకుండా రైతులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని శనివారం ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రాజకీయ కారణాలతో దిగుమతి సుంకం తగ్గించడం సరికాదన్నారు. గతంలో 44 శాతం ఉన్న సుంకాన్ని ఇప్పుడు 10 శాతం వరకు కుదించారని చెప్పారు.
తెలంగాణకు నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ గుండెకాయ లాంటిదని, తెలంగాణ నడిమధ్యలో ఉన్న ఈ ఫ్యాక్టరీకి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఒక్కరోజులో ఆయిల్ గెలలు తీసుకురావచ్చని తెలిపారు. అతి తక్కువ సమయంలోనే 70 వేల మెట్రిక్ టన్నుల గెలలను ప్రాసెస్ చేసి ఈ ఫ్యాక్టరీ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. దేశం మొత్తం మీద 15 లక్షల ఎకరాలు ఉంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌సాగు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3.5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోందని, దానిని వచ్చే ఏడాదికల్ల 5 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 14 ఫ్యాక్టరీలు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. నర్మెట్ట ఫ్యాక్టరీకి నీటి సమస్య వచ్చిందని తన దృష్టికి రాగానే వెంటనే అధికారులతో మాట్లాడి తప్‌సపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయించానన్నారు. ప్రస్తుతం రంగనాయకసాగర్ నుంచి నీటిని పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రశాంతంగా నిమజ్జనం
గచ్చిబౌలి ‘అంతేరా’ సహా.. 11 రెస్టారెంట్ల లైసెన్స్‌లు రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News