Share News

తమ్మిడికుంట విస్తీర్ణం 30 ఎకరాలకు పెంపు.. హీరో నాగార్జునపై సీఎం రేవంత్ ప్రశంసలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 09:54 PM

కొంతమందికి నష్టం జరిగినా.. కొన్ని తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును 30 ఎకరాలకు విస్తరించామని తెలిపారు.

తమ్మిడికుంట విస్తీర్ణం 30 ఎకరాలకు పెంపు.. హీరో నాగార్జునపై సీఎం రేవంత్ ప్రశంసలు
TG CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్11: కొంతమందికి నష్టం జరిగినా.. కొన్ని తరాలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే తమ్మిడికుంట చెరువును అభివృద్ధి చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 14 ఎకరాలకు కుంచించుకుపోయిన ఈ చెరువును 30 ఎకరాలకు విస్తరించామని తెలిపారు. బుధవారం మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున మంచి మనసుతో ముందుకు వచ్చి 2 ఎకరాలు ప్రభుత్వానికి అందించారని చెప్పారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఆయన హీరోగా నిలిచారని ప్రశంసించారు.


హైదరాబాద్ సైట్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్‌లో 1,372 చెరువులుంటే వివిధ కారణాలతో 50 శాతం చెరువులు మాయమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణలతో వర్షాలు వస్తే రోడ్లపై నీళ్లు నిలిచే పరిస్థితి నెలకొందని అన్నారు. దీంతో కాలనీలు జలమయమవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిపై ప్రతీ ఒక్కరూ ఆలోచన చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.


ఆనాడు మూసీ వరదల నుంచి నగరాన్ని కాపాడేందుకు నిజాం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వికారాబాద్ నుంచి మొదలైన ముచుకుందా నది.. మూసా, ఈసా కలసిన చోట మూసీగా మారిందని వివరించారు. ప్రపంచంలో నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆనాడే ఇది గుర్తించి వందేళ్ళ క్రితమే నిజాం.. మూసీ నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.


కానీ ఇప్పుడు మూసీ కాలుష్యమయంగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నల్లగొండ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. అందుకే ఈ పరిస్థితి మారాలని మూసీ పునరుజ్జీవనం చేపట్టాలని నిర్ణయించామని వివరించారు. ప్రకృతిని పరిరక్షించాలన్నదే తన ఆలోచన అని చెప్పారు.


హైదరాబాద్‌ను విశ్వనగరంగా నిలబెట్టడం కోసమే తమ తపన అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే చెరువులను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరినీ అభినందిస్తున్నానని చెప్పారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. మూసీ ప్రక్షాళనలో ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.


రాజకీయాలకు అతీతంగా ఇందుకు కలిసి నడవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. త్వరలోనే మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు ప్రారంభించుకోబోతున్నామని ప్రకటించారు. నగర ప్రజల జీవితాలు మూసీ నదితో ముడిపడి ఉన్నాయని వివరించారు. నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకునే సంస్కృతి మనదని గుర్తు చేశారు. మూసీ నది సుందరీకరణ కాదు.. మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని పేర్కొన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిందే.. చెరువులను ఆక్రమణల చెర నుంచి విడిపించాల్సిందేనని అన్నారు.


ఎన్నికలప్పుడే రాజకీయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధికి రాజకీయాలకి అతీతంగా కలిసి రావాలని కోరుతున్నానంటూ ప్రతిపక్షాలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నిన్నటి వరకు శిల్పారామం గురించే మాట్లాడుకున్నారని.. నేటి నుంచి తమ్మిడికుంట చెరువు గురించి మాట్లాడుకుంటారని అన్నారు. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదని.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అంటారని చమత్కరించారు. ఇక్కడ భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆదేశించారు.


ఇక్కడ లేక్ ఎకానమీని అభివృద్ధి చేసుకుందామని స్థానికులుకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. చెరువు ఆవరణలో ఓ జమ్మి చెట్టును నాటాలని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అలా చేస్తే దసరా వేడుకలకు చెరువులు వేదికగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మన సంస్కృతిని కాపాడుకోవడానికి చెరువులు వేదిక అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు వెక్కిళ్లు ఇచ్చిన సీఎం రేవంత్: కేటీఆర్

సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తా: జగ్గారెడ్డి

For More TG News And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 10:11 PM