ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు వెక్కిళ్లు ఇచ్చిన సీఎం రేవంత్: కేటీఆర్
ABN , Publish Date - Nov 11 , 2026 | 08:09 PM
తెలంగాణలో ప్రస్తుత కరువు ప్రకృతి తెచ్చింది కాదని.. కాంగ్రెస్ పాలకులు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పట్టిసీమ వద్ద సీఎం చంద్రబాబు నీళ్లు ఎత్తి పోస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తి పోయలేదని విమర్శించారు.
నిర్మల్, నవంబర్11: తెలంగాణలో ప్రస్తుత కరువు ప్రకృతి తెచ్చింది కాదని.. కాంగ్రెస్ పాలకులు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పట్టిసీమ వద్ద సీఎం చంద్రబాబు నీళ్లు ఎత్తి పోస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తి పోయలేదని విమర్శించారు. నీటిని ఎత్తి పోస్తే ఇవాళ తెలంగాణ సస్య శ్యామలమయ్యేదని అన్నారు. ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు వెక్కిళ్లు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం నిర్మల్‌లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన ‘రైతు గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికల వేళ మాయ మాటలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా ఆ పార్టీ నెరవేర్చలేదని చెప్పారు. ప్రాజెక్టులను పడావు పెట్టారంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. గోదావరి, కృష్ణా జలాలను వడిసి పట్టకుండా కిందకు వదిలి పెట్టారంటూ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు.
బీజేపీ ఎందుకు ర్యాలీలు చేస్తుంది..
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పైసా ప్రయోజనం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల తీసుకురావడంలో వీరంతా ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ దిగిపోవాలని దేశమంతా ఆందోళనలు చేస్తుంటే.. బీజేపీ ఎందుకు ర్యాలీలు నిర్వహిస్తోందని ప్రశ్నించారు. బీజేపీ హడావుడి చూస్తుంటే అనుమానం కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్ - బీజేపీ దొందు దొందేనని అన్నారు.
60 ఏళ్ల కరెంట్ కష్టాలు తీర్చిన కేసీఆర్: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. మిషన్ కాకతీయ కారణంగా.. మండు టెండల్లోనూ చెరువుల్లో నీళ్లు పొంగిపోర్లాయని వివరించారు. మిషన్ భగీరథతో తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని గట్టెక్కించారని తెలిపారు. 60 ఏళ్ల కరెంట్ కష్టాలను కేసీఆర్ తీర్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై టీజీ సీఎస్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
సోనియా గాంధీ ఆత్మకథను సినిమాగా తెరకెక్కిస్తా: జగ్గారెడ్డి
For More TG News And Telugu News