ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు.. నేడు కీలక ప్రకటన వెలువడే అవకాశం!
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:07 AM
టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ రోజు ఉదయం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 24: టీజీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల పిలుపుతో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం నేడు చర్చలు జరపనుంది. ఈ రోజు ఉదయం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ చర్చలు జరగనున్నాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 32 డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంచాయి. వాటిలో 29 సమస్యలను పరిష్కారించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కానీ మూడు డిమాండ్లపై పీటముడి నెలకొంది.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, రెండు పీఆర్సీలు, ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ఎన్నికల నిర్వహణపై ఇరు వైపులా ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో కార్మిక సంఘాలను అధికారుల కమిటీ కొంత గడువు కోరినట్లు సమాచారం. ఈ రోజు జరిగే చర్చల్లో ఈ మూడింటిపైన ఏకాభిప్రాయం కుదిరితే కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ఒక ప్రచారం నడుస్తోంది.
ఈ చర్చల్లో భాగంగా తొలుత ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దానకిషోర్, సందీప్ సుల్తానియాతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అవుతారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందంతో జేఏసీ నేతలు సమావేశం కానున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఐఏఎస్ అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
For More TG News And Telugu News