హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను.. పదవి నుంచి తొలగించండి: హైకోర్టు
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:50 PM
లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్, జులై 27: లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది.
అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని.. రంగనాథ్‌ను తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు..
ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు తెలిపారు. కోర్టులు, న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా బృందం వెళ్లలేదని కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా రంగనాథ్ తన అఫిడవిట్‌లో తెలిపారు.
ఇవి కూడా చదవండి...
విదేశీ యువతిపై అసభ్య ప్రవర్తన.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై కేసు
కేసీఆర్.. సింగరేణికి తీరని ద్రోహం చేశారు: కిషన్ రెడ్డి
Read Latest Telangana News And Telugu News