Share News

బహిష్కరించక ముందే వెళ్లిపోండి.. కొండా సురేఖపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

ABN , Publish Date - Aug 21 , 2026 | 01:01 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

బహిష్కరించక ముందే వెళ్లిపోండి.. కొండా సురేఖపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
Telangana Congress

హైదరాబాద్, ఆగస్టు 21: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ.. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని అన్నారు.


సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలి: బీర్ల ఐలయ్య

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలే అని.. సొంత పార్టీ వాళ్లు విమర్శలు చేస్తే ఎలా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండాను దించకుండా పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ అని.. ఆయనపైన విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడుతున్న సీఎంపై బండలేస్తారా అంటూ మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే సీఎంపై విమర్శలు చేయడం బాధాకరమని ఐలయ్య అన్నారు.


సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం: వేముల వీరేశం

కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. కొండా సురేఖ భాష పార్టీని ఇబ్బంది పెడుతోందని.. సమంత విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని మండిపడ్డారు. ‘మీ తప్పుడు భాషకు సీఎం మూల్యం చెలించాలా? మీ ఎంటర్టైన్మెంట్ కోసం పార్టీ బలి కావాలా? అధికారంలోకి రావడానికి రేవంత్ చెమట చుక్కలు త్యాగం చేశారు. ముఖ్యమంత్రిని వీక్ చేయాలనే కుట్ర చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై స్పందిస్తున్నాం. సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలి. సీఎం నిర్ణయాలను తప్పు పట్టడం దుర్మార్గం. ఆయన నిర్ణయాలు తప్పు పట్టేవాళ్లు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. సొంత పార్టీ నేతలు ప్రతిపక్షాలకు గొంతు ఇస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వారిని పక్కన పెట్టాలి. పార్టీ వేదికలపై మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడతారా? మైక్ దొరికితే ఊగిపోతారా? సీఎంపై అసత్య ఆరోపణలు చేసినా, ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.


సీఎం రేవంత్‌ను బలహీనపర్చాలని చూస్తున్నారు: బాలు నాయక్

పార్టీకి వ్యతిరేకంగా రాజ్‌గోపాల్ రెడ్డి మాట్లాడినా, బాలు నాయక్ మాట్లాడినా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి అయిపోయిందని అనుకోవద్దని.. కులం, హోదాలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కుట్రను సొంత పార్టీ వాళ్లు అమలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ను బలహీన పర్చాలని చూస్తున్నారని, పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రేవంత్ అని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని బాలు నాయక్ ధీమా వ్యక్తం చేశారు.


ఒక్క ఎమ్మెల్యేతోనైనా సరిగా ఉన్నారా: నాయిని రాజేందర్

కొండా సురేఖపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మెల్యేతోనైనా సరిగా ఉన్నారా అని ప్రశ్నించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని వదిలి పోయారని.. వెళ్లేప్పుడు బీఫారంలు తీసుకొని వెళ్లిపోయారని విమర్శించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రతిపక్షాలకు ఆయుధం ఇస్తున్నారన్నారు. ప్రభుత్వంలో ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది త్యాగాన్ని వృధా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై నిర్ణయాలు కఠినంగా తీసుకోవాలన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఏమైనా చేస్తామంటే కుదరదన్నారు. డూప్లికేట్ మనుషులు.. ఒరిజినల్ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారని, ఏమైనా ఉంటే అధిష్ఠానం దగ్గర తీర్చుకోవాలని సూచించారు. పార్లమెంట్‌లో సురేఖ నియోజకవర్గంలో మెజారిటీ తగ్గిందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించే ముందే వెళ్లిపోవాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హితవు పలికారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్‌ లిక్కర్ పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 01:37 PM