Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కార్ నయా ప్లాన్
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:50 PM
రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామని శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై తెలంగాణ శాసనసభలో చర్చ జరిగింది. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ... తెలంగాణ డీజీపీ మీడియా సమావేశంలో ఒక ప్రకటన చేశారని.. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్నాయని తెలిపారన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తాము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో అఫిడవిట్ తీసుకురావాలని చెప్పారు. ఇందు కోసం విద్యా శాఖ, సంక్షేమ శాఖ పాఠశాలలు పాల్గొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులకు, ప్రతి పౌరునికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. యూనిసెఫ్ సహకారంతో స్కూల్‌లో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అందరూ పాల్గొనాలి...
తెలంగాణను రోడ్డు ప్రమాదాల రహితంగా మార్చడానికి జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉంటే.. కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని.. ప్రతీ ఒక్క వాహనాలు చెక్ చేయడం కుదరదని తెలిపారు. ఎవరికి వారు స్వయంగా వాహనాల ఫిట్నెస్ చూసుకోవాలని.. రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. వికారాబాద్ బస్సు ప్రమాదంలో ఎవరో చేసిన తప్పిదానికి అమాయకులు చనిపోయారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ విద్యార్థులు, ఇతర పాఠశాలలు రోడ్ సేఫ్టీపై కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అందరూ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బ్లాక్ స్పాట్‌లను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతి వేగానికి, స్పీడ్ కట్టడికి కెమరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోడ్ సేఫ్టీపై ప్రతీ ఒక్కరూ, అన్ని విభాగాల అధికారులు భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ఆదేశించారు.
కాలుష్యాన్ని అరికడతాం...
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్‌లో ఈరోజు ఎయిర్ క్వాలిటీ 300 దాటిందని అంటున్నారని.. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగి కాలుష్యాన్ని అరికడుతున్నామని తెలిపారు. స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని.. 15 ఏళ్లు దాటిన వాహనాలు ఈ స్క్రాప్ పాలసీలోకి వస్తాయన్నారు. త్వరలో ఢిల్లీ మాదిరి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 10 ఏళ్లలో వాహన సారధిలో చేరలేదని... దేశంలో 29 రాష్ట్రాలు వాహన సారధిలో చేరితే తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాహన సారధిలో చేరామని మంత్రి పేర్కొన్నారు.
వాటికి మాత్రమే రోడ్ సేఫ్టీ సెస్..
4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక టాక్స్ ఉండేదని... రవాణా శాఖ నిపుణులతో చర్చించి గూడ్స్‌కు సంబంధించిన వాహనాలపై లైఫ్ టాక్స్ విధిస్తూ 7.5 శాతానికి చేయడం జరిగిందని చెప్పారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు రూ.2 వేలు, లైట్ మోటార్ వాహనాలకు రూ.5 వేలు, హెవీ వాహనాలకు రూ.10 వేలు రోడ్ సేఫ్టీ సెస్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు మాత్రమే రోడ్ సేఫ్టీ సెస్ విధించడం జరుగుతుందని, ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు ఇది వర్తించదని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోయిన కీలక నేత
బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం... అసెంబ్లీ బహిష్కరణ
Read Latest Telangana News And Telugu News