Telangana Assembly: గృహ జ్యోతి పథకంపై సభలో డిప్యూటీ సీఎం భట్టి క్లారిటీ
ABN , Publish Date - Jan 03 , 2026 | 01:54 PM
గృహజ్యోతి పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో స్పష్టతనిచ్చారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహ జ్యోతి వర్తిస్తుందన్నారు.
హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ప్రధానంగా గృహ జ్యోతి పథకం, ఇంద్రమ్మ ఇళ్లు, వ్యవసాయ పథకాలు, సోయా కొనుగోలు వంటి ముఖ్య సమస్యలపై చర్చలు జరిగాయి. ముందుగా గృహ జ్యోతిపై ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, నాగరాజు పలు ప్రశ్నలు సంధించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ – గృహ జ్యోతి పథకం కొనసాగింపుపై సభలో డిప్యూటీ సీఎం స్పష్టతనిచ్చారు.
పేద, బడుగు వర్గాలు ఆత్మగౌరవంతో జీవించడమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ గృహ జ్యోతి వర్తిస్తుందన్నారు. కొత్త దరఖాస్తులు, మార్పులు – చేర్పులకు ప్రజా పాలన కార్యాలయాల్లో అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 52.82 లక్షల కుటుంబాలకు గృహ జ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరుతోందని తెలిపారు. గృహ జ్యోతి కోసం ఇప్పటి వరకు రూ.3,593 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లింపులు చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై..
వ్యవసాయం రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమాధానిమిస్తూ.. వ్యవసాయ రంగంలో ఆగిన పథకాలను పునరుద్దరణ చేపడుతున్నామని చెప్పారు. సోయాను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినా, కేంద్రం కొనడం లేదని అన్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రి సూచించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు చెల్లించిన బిల్లులలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, విచారణ పూర్తైన తర్వాత పెండింగ్ బిల్లులను చెల్లిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమర్శలు..
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విమర్శలు చేశారు. తమ నియోజకవర్గాల్లో బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలని, టెక్నికల్ సమస్యలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న ఇండ్లతో పాటు అదనపు ఇండ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు.
ఇవి కూడా చదవండి...
నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు
ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
Read Latest Telangana News And Telugu News