Vemula Prashanth Reddy: ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం.. సర్కార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:49 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం భజన చేసేందుకు తాము అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని దేశమంతా చూసిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాలలో సీఎం గంటన్నర సేపు మాట్లాడటం శాసన సభ చరిత్రలో లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా వాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టా రాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుకోవటం... హరీష్ రావును బాడీ షేమింగ్ చేయటం తప్ప సమాధానం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి నోట్లో మూసి కంపు పెట్టుకొని హరీష్ రావు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఫైర్ అయ్యారు.
స్పీకర్ కూడా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని మాట్లాడారని తెలిపారు. ఇదెక్కడి సభ... ఇదెక్కడి సంప్రదాయం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భజన చేయటానికి తాము అసెంబ్లీకి రావాలా అంటూ నిలదీశారు. అందుకే అసెంబ్లీని బహిష్కరించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడైనా కనువిప్పు కలిగి వచ్చే శాసనసభా సమావేశాల్లో అయినా తమకు మైక్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2016లో కేసీఆర్ పీపీటీకి కాంగ్రెస్ సభ్యులు హాజరుకాలేదని గుర్తుచేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆనాడు కాంగ్రెస్ లేఖ రాసిందని తెలిపారు. ఇప్పుడు అధికారంలో ఉండి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం ద్వంద్వ విధానాలకు నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. అవకాశం ఇస్తే అవమానాలను దిగమింగుకొని ప్రజల కోసం పీపీటీ కోసం అసెంబ్లీకి వెళతామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
శ్రీనివాస కల్యాణంతో మహాసభలకు శ్రీకారం
నీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో గళమెత్తిన బీజేపీ ఎమ్మెల్యేలు
Read Latest Telangana News And Telugu News